Jump to content

పుట:Sakalaneetisammatamu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. దానమును లుబ్ధభేదము
మానుగ నన్యోన్యశంకమానాత్ముల దు
ష్టానీకము నేర్పడఁగ న
నూతన దండమున వశము నొందింపఁదగున్. 631

ముద్రామాత్యము

మాయోపాయము

సీ. మఱి దేవతాప్రతిమాస్తంభసుషిర
సంపిహితులచేతఁ జంపించుటయును
స్త్రీవేషధారియై చేరి చంపుటయును
రాత్రిమై ఘోరదర్శనముసేఁత
ఉగ్రబేతాళమహోల్కాపిశాచశి
వారూపదారుణవర్తనంబు
ఇవ్విధములను ననేకవిచిత్రసం
పాదనము మనుజమాయ యయ్యె
గీ. కామరూపధరత్వంబు గడఁగి శస్త్ర
వహ్నిపాషాణశరజనవర్షణంబు
తగఁదమోమేఘశైలసందర్శనంబు
మార్తు రలక నమానుషమాయయయ్యె. 632

క. స్త్రీరూపంబున భీముఁ డ
వారితముగ సింహబలుని వధియింపఁడె ము
న్నారయ నలుఁడును గూఢా
కారుండై దివ్యమాయ గడగఁడె పెలుచన్. 633

క. తనకంటెఁ బ్రబలు నబలుఁడు
ఘన మగు నొక మాయయైనఁ గడతేర్పఁదగున్
వనితారూపము గైకొని
చని భీముఁడు సింహబలునిఁ జంపిన మాడ్కిన్. 634

ఉపేక్షోపాయము

క. వ్యసనము నన్యాయంబును
మసలక యుద్ధమును జెయ మాన్పమి యది దాఁ
బొసగుఁ ద్రివిధస్వరూపత
నెసఁగు నుపాయములయం దుపేక్ష యనంగన్. 635

క. ప్రకటముగఁ గీచకుం డొగి
నకార్య మొనరించువేళ నవినీతుండై
చకితుండపోలె విరటుం
డొకభంగి యుపేక్షచేసి యుండఁడె మదిలోన్. 636

సీ. మేఘాంధకారసమిద్ధవర్షాగ్నివి
దాహపర్వతఘోరదర్శనంబు
నున్నతధ్వజనియోజదగ్రసైన్యవి
తానభీకరదూరదర్శనంబు
ఛిన్నపాటితపటుభిన్నక్షరద్రక్త
ధావద్భటోద్భటదర్శనంబు
నివి యాదిగాఁ గల యింద్రజాలక్రియ
దగు నైంద్రజాలికదర్శనంబు
ఆ. ఇటులు పెద్దఁబడిన యీయుపాయంబులు
సాల బహువిధార్థసాధనములు
గా నెఱింగి యుచితకాలముతోడ ను
పేక్ష యోజ మీఁదఁ జేయవలయు. 637