గీ. గాన విగ్రహింపక సామదానభేద
విధుల సీమాసమాగతవిమతనృపునిఁ
గలఁచి సంభ్రమ మడఁచి దవ్వులె నిలిపి
సమబలుండయి తోఁచిన సంధి యొప్పు. 563
గీ. ఆత్మబలగాఢసంరక్షితాత్ముఁ డగుచు
వీరసంచారములఁ దాపవివశుఁ జేసి
చాల నిలచినఁ దనుఁ దాన సంధి యగును
దప్తలోహద్వయానుసంధానమట్లు. 564
కామందకము
క. మును దన కపకారము సే
సినవానికిఁ దాను గీడు సేయక సామం
బున సంధి యగునె కాఁపని
యిను మినుమును గదియ నడువనేలా కూడున్. 565
సీ. మైత్రిహిరణ్యభూమండలంబులలోన
నలర నొక్కటిఁ గొన్న నుత్తరోత్త
రము మేలు మును సహాయము లేనివానికి
మిత్రు లన్యముకంటె మే లతండు
నాపదలకుఁ గూడి యరుదేని వాఁడైన
భూమిఁ దా విడువంగఁ బూనెనేని
ధనము మే లచలుఁడై తానుండు వానికి
సీమతోఁ జేరిన భూమి మేలు
ఆ. కపటమిత్రత మును నెపుడు సొనారని
పణము నెన్నఁడు ఫలపడని భూమి
యును నిరర్థకంబ యోపినయెవ్వానిఁ
దెలిసికొనుట భూపతికి గుణములు. 566
నీతిసారము
క. ఇప్పాట సంధికృత్యం
బొప్పారుం బూర్వము నిజనోక్తనయగతిన్
ఇప్పగిది లావు సంధియు
నొప్పగు నధికాల్పకార్య మూహించి తగన్. 567
సామము
గీ. సత్సహాయము ప్రజ్ఞయుఁ జాలఁగలిగి
సత్త్వదేవోపబృంహితచరితుఁ డగుచు
నాయతోద్యోగసద్వ్యవసాయములను
శత్రుమీఁద నుపాయముల్ సలుపవలయు. 568
క. తొలుతఁ జతురంగబలములఁ
దలపెట్టక సామమంత్రతత్త్వజ్ఞుం డై
లలి మాంత్రకోశబలమున
గెలువంగావలయు నృపతి గినిసి యరాతిన్. 569