చ. పలుకుల బెట్టిదంబులకుఁ బ్రాప్త మెఱుంగమి కెంత డస్సినన్
దలఁపమి కిచ్చి తప్పుట కుదారపువృత్తికి శౌర్యశక్తిభ
క్తులకు మనంబులోనఁ బరితోషముఁ బొందకయున్కి కాత్మలో
నలసి పరిత్యజింతు రెడ కా నెడ నేలినవాని సేవకుల్. 495
పురుషార్థసారము
క. కెలసము చేసియు నవసినఁ
గొలిచిన కొద వట్ల యీని కువలయపతులన్
గొలు వేటి కుత్తరోత్తర
ఫలసారమె రాజసేవ బద్దెనరేంద్రా. 496
బద్దెననీతి
చ. ఇల వ్యసనుండు క్షుద్రుఁడును నెంతయు మూర్ఖుఁడు నైనయట్టి భూ
తలపతిఁ జేరఁగూడ దది తప్పగుఁ దొల్లియు నిట్టిరాజు నిం
పలరఁగ సేవఁ జేసికొని న్యాయము నాసపడంగఁ బోవుచున్
బెలుచన నేరమిన్ శకడి భృత్యువులందఱుఁ జేటు నొందరే. 497
క. విను సర్వభక్షుఁడగు వి
ప్రుని ననుకూలతయుఁ గాని పొలఁతిని మిగులం
దన కెనయని సఖు లెల్లం
దును గరుణయె చేయు నృపునిఁ దొఱఁగఁగవలయున్. 498
పంచతంత్రి
క. నేరమి దొడరిన నలుగఁగ
నేరకయుండెడి విరక్తనృపతుల కొలువుల్
దూరస్థులు గాకుండెడి
వారలు దుర్మతు లుదారవైరోచనుఁడా. 499
బద్దెననీతి
ఆ. ఎట్టిభృత్యుఁడైన నేలిక కించుక
తప్పు సేసెనేని తలఁప మద్య
బిందుమాత్రమునన పెరుగు బ్రాహ్మణ్యంబు
సెడినయట్ల వాఁడు సెడుట నిజము. 500
పంచతంత్రి
ఉ. జీతము లూదికొండ్రు పతిచిత్తము గూడరు వారు స్వేచ్ఛులై
భూతలనాథు వీ డురిలిపోవఁగఁ డూతురు పోవకుండినన్