Jump to content

పుట:Sakalaneetisammatamu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. శ్రీయుతు లగు నరనాథులఁ
బాయక సేవింపకుండు పాపాత్ములకున్
వేయేల తిరియఁజేఁతయె
ప్రాయశ్చిత్తంబు సుమ్ము పరికింపంగన్. 468

క. వెలిగొడుగులు చామరములు
బలువాజులు నందలములు భద్రేభంబుల్
వెలసిన భూనాథుని కృప
గలవారికిఁ గాక యెందుఁ గలవే ధరణిన్. 469

క. బలుగొఱడువోలె నెండకుఁ
జలికిని వానకును నోర్చి జనపతి నెవ్వం
డలవడఁ గొలుచును వానికి
వలనొప్పఁగ సిరులు దాన వచ్చి వసించున్. 470

ఆ. మాన్యతయును గడు నమాన్యతయును మఱి
సరియె కాఁ దలంచు నరులు పిదప
నుగ్రమూర్తు లైన యుర్వీశ్వరులకును
మిగులఁ దారె మాన్యు లగుదు రెపుడు. 471

క. క్షితిపతికి మిగులఁ బ్రియులును
హితులును నగువారి నాశ్రయింపఁగవలయున్
సతతము వారల యాజ్ఞకు
నతిఁ గడవక యుండవలయు నతిమతిమంతుల్. 472

క. ఘనసేవకయుతులకు నఘ
మును పుణ్యములును విశేషములు గానివి దాఁ
గొనుఁగొన భూశయలఘుభో
జనముఁ గృశత్వంబు బ్రహ్మచర్యము సమముల్. 473

ఆ. సేవకుండు గోరి సిగ్గఱి వ్యాధిక
ష్టములు ధనముకొఱకు సంతతంబు
నధిపు నొద్దఁ బడిన యట్ల ధర్మమునకుఁ
బడియెనేని సుగతిఁ బడయరాదె. 474

క. సురచిరగుణవంతుం డగు
ధరణీశుఁడు పేదయైనఁ దగు సేవింపన్
నెరయఁగ నొకానొకప్పటి
కరుదుగ మేలొందుఁగాన నాయనవలనన్. 475

క. వలయుపను లెఱిఁగి చేయుచుఁ
బలికినఁ బని యేమి యనుచుఁ బాయక నీతిన్
గొలువఁగ నేర్చిన యాతఁడె
తలపోయఁగ మిగులఁ బ్రియుఁడు ధరణీశునకున్. 476

క. మన సెఱిఁగి నడవనేర్చిన
మనుజశను లైన మాటమాత్రములోనన్
దనవశ్యు లగుదు రనినను
మనుజేశ్వరుఁ డనఁగ నెంత మది నూహింపన్. 477

పంచతంత్రి