క. స్థిరమతి నెప్పుడు నిజమం
దిరమునఁ దద్ద్వారమునను దెల్లముగా సం
గరముననుం గ్రమ్మున నే
నరుఁడుండు నతండు ప్రియుఁడు నరనాథునకున్. 462
నీతిభూషణము
క. జూదమును బన్నిదంబును
వాదును బతితోడ నాడవలవదు కడుఁ బో
రాదయ్యెనేని భృత్యులు
భేదము గాకుండ గెలుపు పెం పీవలయున్. 463
నీతిసారము
క. మొగ మలరఁ జూచిరమ్మను
టగుఁబొమ్మని మాటవినుట యడిగిన కార్యం
బొగిఁ జేయుట పనిఁబంచుట
జగదీశ్వరుకూర్మికిని నిజం బగు చేష్టల్. 464
సీ. పొడగనునంత నప్పుడ ప్రసన్నుం డగుఁ
దనుఁ జేరఁ బిలుచు నాసనము నిచ్చు
క్షేమప్రసంగంబుఁ బ్రేమమై నడుగుఁ ద
ద్వాక్యంబు వినుచు ముదంబు బొందు
విజనస్థలంబున నిజరహస్యంబులు
గొంకఁ డొక్కింతయు శంకపడఁడు
ఆతఁడు సెప్పుచో నతనిఁ జెప్పినచోట
నాకర్ణనముఁ జేయు నాదరమున
గీ. వినుతిపాత్రులలోపల వినుతిఁ జేయు
నతని వినుతింప మెచ్చఁ గథాంతరముల
దలముగాఁ దద్గుణములు కీర్తనము సేయుఁ
జాల ననురక్తుఁ డైనట్టి జనవిభుండు. 465
పురుషార్థసారము
క. వచ్చినఁ జూడమి దగ్గఱ
వచ్చిన నొడఁబడమి తోడ వచ్చిన నొరుతో
జెచ్చెరఁ బలుకుట పతిఁ దా
మెచ్చమియును భృత్యునొల్లమికి లక్షణముల్. 466
చాటువు
క. దుర్వేషియు నకులీనుఁడు
గర్వియుఁ గడుదుర్జనాగ్రగణ్యుం డైనన్
సర్వత్ర వాఁడు పూజ్యుఁడె
యుర్వీశ్వరు మిగులఁ జేరి యుండినఁ జాలున్. 467