పుట:Sakalaneetisammatamu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. కలిమియును భూరిబలమును
గలయంతకు భటుఁడు భటుఁడు గాఁడు దలంపన్
గలిమియును భూరిబలమును
గలిగిన మఱి భటుఁడు భటుఁడు గాఁ డేపతికిన్. 454

పంచతంత్రి

సేవకనీతులు

క. ధరణీసురవరులకు నృప
వరులకు వైశ్యులకు నాత్మవర్తనములకున్
బరిచరులు లేక నడవమి
సరసిజసంభవుఁడు శూద్రజాతి సృజించెన్. 455

క. అతులితవిద్వజ్జనులకు
వితరణశీలురకు విశ్వవిక్రమసేవా
గతులకు రాజులు దక్కఁగ
మతిఁ దలపఁగ నొరులు దిక్కు మఱి కలుగుదురే. 456

క. మనుజపతి దేవతామయుఁ
డని మనువాక్యంబు గాన యారీతిన కాఁ
గొనవలయు నతని నొండుగ
మనంబునం జూడవలదు మతిమంతులకున్. 457

క. దేవాంశోద్భవుఁ డగునర
దేవోత్తము మర్త్యుఁ డని మదిం దలఁపక స
ద్భావమున నీశ్వరుండని
భావింపఁగవలయు నరులు బాలుని నైనన్. 458

పురుషార్థసారము



క. అవనీశుల వేల్పులలో
నవనిపులు విశేష మతిశుభాశుభములు దా
నవనిపు లిప్పుడ సూపుదు
రవి వేల్పులు సూపఁజాల రాజన్మమునన్. 459

క. కడుహితులకు నహితులకును
వడిమేలును గీడుఁ జేయవలసినవారల్
పుడమిపులఁ గొలువవలయును
గడు పెవ్వడుఁ బ్రోచుకొనఁడె కరటక చెపుమా. 460

పంచతంత్రి



క. తక్కి నయాత్ముఁడు గలఁడే
యెక్కుడుగా నెత్తి పలికి హిత మెఱిఁగింపన్
జెక్కిలి మీటుట కూరిమి
తక్కుటయే పాలు పోయు తఱి బాలునకున్. 461