క. కోపప్రసాదములలోఁ
గోపమె చూపుచుఁ బ్రసాదగుణ మెయ్యెడలన్
జూపని నరపతిఁ గొల్చిన
పాపమునకు మేర యెద్ది బద్దెనరేంద్రా. 447
ఉ. జీవిత మీఁడు ము న్గడవఁజేసినవృత్తి క్రమక్రమంబునన్
బోవఁగఁజూచుఁ దేజమునఁ బుట్టెడు లాభము దప్పఁజేయు స
ద్భావము బొంకుగా వగచుఁ బాయక నేరమె రోయుఁగావునన్
సేవకులన్ విరక్తనృపుసేవ విపజ్జలరాశి ముంపదే. 448
బద్దెననీతి
ఆ. వల్లకాట నిడినవానికిఁ జెప్పెడి
వారు గలరె యెంతవారికైన
నట్ల పెట్టలేని యవనిపాలకునొద్దఁ
బట్టియుండ రెపుడు పరిజనములు. 449
పంచతంత్రి
రాజులకుఁ గొఱగాని భృత్యులు
చ. ఒకరునిచేతఁ బ్రోపును దదున్నతిఁబ్రాపును గాంచి యెల్లవెం
టకును గొఱంత లేక పొగడందగు సంపద నొందునట్టి దా
తకు మదిఁ గీడుచేసినకృతఘ్నునిపీనుఁగునైన రోఁత వె
ట్టక కబళింపఁ గుక్కలు నొడంబడునే కురువంశవర్ధనా. 450
ఉ. ధీరత దక్కి భీతిఁబడి దీఱమి నిల్పక పాఱి పాఱి వీ
రారులచేతఁ జచ్చినభటాధము లేలినవానిదుష్కృతం
బారఁఘ నంతయున్ గుడుచునాతఁడు చేసినపుణ్యమంతయున్
జేరుఁ దదీయభర్తకని చెప్పుదు రుత్తమధర్మకోవిదుల్. 451
విదురనీతి
ఆ. ఆయుధముల నెపుడు నలజడిఁ బెట్టక
చిత్రకథలు కొన్ని చెప్పికొనుచు
నుండు భటులు గలుగు నుర్వీశ్వరులలక్ష్ము
లహితు లనుభవింతు రండ్రు బుధులు. 452
పంచతంత్రి
క. తను నమ్మి వైరిమీఁదం
జన వానికిఁ బ్రాణ మీక చనుటయు ద్రోహం
బని రిపునిఁ గూడెనేనియుఁ
జనునే యుద్దండ మైన జనపతి దానిన్. 453
నీతిసారము