పుట:Sakalaneetisammatamu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. మానుగఁ బతి వనిచినఁ దను
చే నిది గా దనక వేగఁ జేకొని యనలం
బైనఁ జొరవలయు నంబుధి
యైనను నీఁదంగవలయు నర్థిన భృత్యుల్. 438

పంచతంత్రి



క. దూరమున వెరవు గదిసిన
దారి నిలుచువారి నృపతి దగు మన్నింపన్
దూరమున బిఱుదు గదిసినఁ
దా రచ్చట లేనివారిఁ దగు వర్ణింపన్. 439

నీతిభూషణము



క. ఏయేలిక సేవింపఁగ
బాయక యేభృత్యులకును బహుదుఃఖము కా
నాయేలిక దూరమునన
నాయతమతి విడువవలయు నాభృత్యులకున్. 440

క. ధనవంతుఁడు సత్కులజుఁడు
ననుపమతరవిక్రముండు నైనను ధరలో
ననభిజ్ఞుఁడైన భూపతి
ననుమానము లేదు విడుతు రరయఁగ భృత్యుల్. 441

క. వలచేయును డాచేయును
బొలుపుగ రత్నంబు గాజుపూసయు సరిగాఁ
దలఁచు నృపు నొద్ద నుండినఁ
జులుకన యగుఁ దప్ప దెంతశూరుండైనన్. 442

పంచతంత్రి



క. పతి కీడైనను భృత్యుఁడు
పతిహితుఁడై యుండవలయు బ్రతుకఁగరా కా
పతిఁ బాసి చనిన వేఱొక
పతియైనను బ్రోచుఁ దొంటిపతిహితుఁడనుచున్. 443

పురుషార్థసారము

భృత్యులకుఁ గొఱగాని రాజుల లక్షణము

క. అకుటిలు లగు తనభృత్యుల
కొకయాపద ముట్టినప్పు డుడుపక యేయే
లిక యూరకుండు నాయే
లిక ముక్తికి మిగుల నెడ గలిగియుండుఁ దుదిన్. 444

క. పలికిన జీతముఁ గెడపిన
బలవంతునినైన విడుచుఁ బరివారము దాఁ
బొలు పెఱుఁగని యేలిక నిల
ఫలహీనకుజంబు విడుచు పక్షులఁబోలెన్. 445

పంచతంత్రి



క. దొర వడయవలయునొండెను
సిరి వడయఁగవలయు నృపతిచే భృత్యులకున్
దొరయును సిరియును వెలిగా
నరపతులను గొల్చు టేల నయతత్త్వనిధీ.446