పుట:Sakalaneetisammatamu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. తన కెన్నఁ డుండియును ద
క్కనిభృత్యులఁ బెరుగ మనుపఁగాఁ జనదు ప్రయో
జనమునకుఁ దగినవెల యి
చ్చునది నరేశ్వరుఁడు నన్నిచోడనరేంద్రా 420

క. మనుపఁగొరయేని జీతము
దనియఁగ నిచ్చునది యెంతదయ గల్గిన నే
రనివాని నెఱతనమునకుఁ
జొనుపుట దుర్నయము నన్నిచోడనరేంద్రా. 421

బద్దెననీతి



క. ఎవ్వని ప్రసాదమున సుఖ
మెవ్వనికిం గలియుండు నెల్లప్పుడుఁ దా
నవ్విభునికొఱకు మృతుఁడగు
టెవ్విధమునఁ బుణ్యలోకహితము దలంపన్. 422

ముద్రామాత్యము



క. పుడమిపతిచేత జీతము
కుడిచిన ఋణమెల్ల నీఁగికొనఁ దనయంతన్
జెడనున్న ప్రాణ మనిలో
విడువక పోనాడు భటుఁడు వేదురు గాఁడే. 423

క. నుతులకుఁ దలప్రాపుగ భూ
పతి ఋణమునఁ బోయి తెవులఁ బడి చచ్చి యధో
గతి దొఱఁగుకంటె భటునకు
శతమఖుపురిఁ జూఱగొనుటఁ జావని నరుఁడే. 424

పురుషార్థసారము



ఆ. అఖిలసంపదలకు నావాసముగఁ జేసి
నట్టిదాత కొడరు పుట్టినపుడు
దరణి నేభటుండు తనప్రాణములు దాఁచు
నతఁడు నరకమునకు నరుగు వేగ. 425

పంచతంత్రి



క. కులభృత్యులైన సద్భృ
త్యులకును సత్కారమర్థితోఁ జేయుదె వా
రలు నీప్రస్తవమున ని
మ్ములఁ గృత్యము దలఁచి ప్రాణములు విడుతురనిన్. 426

క. అనఘా నీప్రస్తవమున
నని నీల్గిన వీరభటుల యనుఁగుజనుల నె
ల్లను బ్రోతె భోజనాచ్ఛా
దనముల వారలకు నెమ్మిఁ దఱుగకయుండన్. 427

క. జనపతి ప్రాణము లిచ్చినఁ
జనువారలఁ బ్రోవకున్న సత్యము పాపం
బునఁ బొరయు వారిఁ బ్రోచిన
తనవారిని బ్రోచు మీఁద దైవము గరుణన్. 428