పుట:Sakalaneetisammatamu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. తమతమ కనియెడుతరి జీ
తము గానక నవయుభటుల దౌర్గత్యవిషా
దము లేలినవాని కవ
శ్యము నెగ్గొనరించు నతఁడు శత్రుం డైనన్. 412

సభాపర్వము



చ. నవసినవారిఁ బ్రస్తవమున స్మృతిఁ బొందినవారివారి నా
హవముఖవీరులన్ బనులయందుఁ బ్రగల్భుల వేఱులేనిబాం
ధవుల నయజ్ఞులన్ బుధులఁ దప్పనికాపుల శక్తియుక్తులన్
ధ్రువముగఁ బ్రోవలేని నృపతుల్ కుపతుల్ పరపక్షవైభవా. 413

క. నుడివినజీతం బెప్పుడుఁ
గడపక తాఁ బెట్టునృపుఁడు గా నొకచక్కిన్
గడు వర్జించిననైనను
విడువరు సద్భృత్యు లెపుడు విసువరు కొలువన్. 414

క. భూపతి విరక్తుఁడైనను
నాపత్కాలమున విడుచు టవినీతి యగున్
ఆపద పైకొనునయ్యెడ
నోపి విడువకుండునాతఁ డుత్తముఁ డరయన్. 415

బద్దెననీతి



ఆ. ఉర్విపతులవలన నొకయుపద్రవ మైన
నపుడు పెట్టకున్న నైన భటులు
తగిలి తన్మహీశుఁ దమ జీవనంబుల
హానిఁ గోరి కెలుచు రనుదినంబు. 416

ఉ. ఏపునఁ గూడి పూర్వమున నేలినవానినయొండెఁ దక్కొరున్
భూపతిఁ జేయుటొండెఁ దలపోతురు రాజులనొండె నొండొరున్
బ్రాపుగఁ జేసి రాఁదలఁచి ప్రాణము లీ వడిఁ గారణంబుగా
రాపొనరింపఁగాఁ దగదు రాజు భటావళి నెల్లకాలమున్. 417

చ. అఱమి రణంబునం బడిన యాతని సంతతిఁ బ్రోవఁడేని చే
కుఱు నట జీవితంబు గొని ఘోరరణంబున నోడి వచ్చినన్
బఱవకయుండె నేని జనపాలుని దిక్కున నంత వేడ్కయున్
వెఱవును జెడ్డ బ్రాణములు వెఱ్ఱులె యీ ననిలోన సేవకుల్. 418

క. ఏలిక పనిచినఁ గీడౌ
మే లౌ నది భటుఁడు సేయ మెయికొనఁ డేనిన్
వాలాయము విడువనె తగు
నాలరి యగు భటునిఁ దలఁప నయ్యేలికకున్. 419

పంచతంత్రి