Jump to content

పుట:Sakalaneetisammatamu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గీ. తీర్థముల నాశ్రమంబుల దేవగృహము
లందుఁ దాపసవేషంబు లలవరించి
యున్న నిజచారజనులతో నుచితశాస్త్ర
పటువివేకమిషంబునఁ బలుకవలయు. 355

క. పానద్యూతము లుడుఁగుచు
నానాఁటికి నచటివార్తనరనాథునకున్
దా నమ్మిక గలనరుచే
మానుగ నెఱిఁగింపఁబంపుమత మది వలయున్. 356

క. తనపతికులముఁ బ్రతాపము
వినుతైశ్వర్యంబుఁ ద్యాగవిభవము దార్ఢ్యం
బును నుత్సాహము ఘనతయుఁ
బెఁనుపుగ నుపమింపవలయు భేద్యులయెదురన్. 357

క. కాలముతోడన తనపనిఁ
గీలింపుచు నొరులభేదకిల్బిషములచేఁ
దూలక కాలక్షేపము
లాలోకింపగవలయు నన్యకృత్యంబుల్. 358

సీ. ఇన్నిదినంబులు నితఁడు విలంబింప
నితనికిఁ గారణం బేమియొక్కొ
మన్మహీపతియందు మహితవ్యసన మొక్కఁ
డారసి పొడఁగను నాసనొక్కొ
స్వాంతప్రకోపము నడఁచుటకై యొక్కొ కడ
గి సస్యాదిసంగ్రహముకొఱకొ
ప్రత్యగ్రదుర్గనిర్మాణంబునకునొక్కొ
కృతపూర్వదుర్గసత్క్రియలకొఱకొ
గీ. పక్షవృత్తిని యాత్రకు బాగు గాఁగ
దేశకాలవిభేదనోద్వీక్షణంబొ
యాత్మయాత్రావసరసత్క్రియార్థమొక్కొ
యనుచుఁ గాలవిలంబన మరయ వలయు. 359

గీ. మఱియు వార్తావిశేషంబు నెఱుఁగుచుండి
తననృపాలున కెఱిఁగించి పనుపవలయుఁ
గాలయాపనహేతువు గానవచ్చి
వెరవుపడకున్న నప్పుడు వెడలవలయు. 360

క. జనపదసారము దుర్గం
బున గుప్తము శత్రురంధ్రమును ధనము బలం
బును మిత్రబలము నొయ్యన
మనమునఁ దెలియునది దూతమార్గం బరయన్. 361

చ. అరివరుశత్రుదుర్గమును నాతనిబంధుసుహృద్విభేదమున్
బురధనసైన్యసంపదలపోఁడి మెఱుంగుట కృత్యపక్షని
స్తరపరిసంగ్రహం బతనిజానపదాటవికంబు సాధ్యముల్
దిరమిడి యుద్ధసారము విధిజ్ఞత యన్నివి దూతకర్మముల్. 362

కామందకము