పుట:Sakalaneetisammatamu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. అవనీపతి నిల్పందగుఁ
బ్రవిమలమతిచతురు నిఖిలభాషాకుశలున్
సవినయశీఘ్రవిలేఖను
వివిధవిధిప్రౌఢు సంధివిగ్రహపదవిన్. 337

పురుషార్థసారము



క. కృతమంత్రుఁ డగుచు భూపతి
చతురుని నిజమంత్రి మంత్రసమ్మతు నెపుడున్
వ్రతసాభినాను గమ్య
క్షితిపతికడ కనుపవలయుఁ జెచ్చెఱ దూరన్. 338

కామందకము



శా. నానాశాస్త్రవిచక్షణుండు నయనానందాంగుఁడున్ సత్కుల
స్థానశ్రేష్ఠుఁడు నిస్పృహుండు పరచిత్తజ్ఞుండు వాక్సిద్ధుఁడున్
శ్రీనిత్యుండును లోకమాన్యుఁడగు నిశ్చింతుండు నై యుండినన్
వానిన్ మానుగ రాజదూత యని తల్పన్ వచ్చు నుర్వీస్థలిన్. 339

పంచతంత్రి



క. శ్రుతిమంతుండు ప్రగల్భుఁడు
కృతకర్మాభ్యాసి వాగ్మి కీర్తితశుభస
న్మతి శస్త్రశాస్త్రనిష్ఠుఁడు
పతికిన్ దగు దూత గాఁగ బహుకార్యములన్. 340

కామందకము



క. ప్రతిభయు నవ్యసనిత్వముఁ
బతిభక్తియుఁ బలుకువెరవుఁ బరనృపధర్మ
జ్ఞతయును వినయముఁ దేజము
నతిశుచితయు దూతగుణము లండ్రు నయజ్ఞుల్. 341

సీ. లిపులెల్లఁ జదువను లిఖియింప వలఁతియై
భాషలఁ బెక్కింటఁ బ్రౌఢి గల్గి
సమయవర్ణాశ్రమాచారవిధిజ్ఞుఁడై
యెదిరిని దన్నును నెఱుఁగనేర్చి
మధురగంభీరసమస్థిరవాణియై
సుముఖుఁడై కార్యభారమున కోర్చి
మఱి పదవాక్యప్రమాణవిజ్ఞానియై
ప్రజ్ఞ నూహాపోహపరుఁడు నగుచు
గీ. రాజహితుఁడయ్యుఁ బ్రజ కనురాగ మెసఁగఁ
జేయ నేర్చిన యాతనిచేతఁ గాక
యితరదూతలు చేసిన నేల పొసఁగు
విమతజయకారు లగు సంధివిగ్రహములు. 342

నీతిసారము