Jump to content

పుట:Sakalaneetisammatamu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. ప్రతికూలవేళ లెఱుఁగుచుఁ
బ్రతికృతరాశ్యాదు లెఱిఁగి పతిరాశిఫల
జ్ఞత యొరు లెరుంగకుండఁగ
సతతము రక్షింపవలయు సాంవత్సరికుల్. 330

సీ. వాన లెక్కువతక్కువలు గాఁగఁ గురియుట
చిలుకలు మిడుతలు నెలుకపిండు
నాదిగా సస్యోపహతికారణంబులు
గలుగుట తవులును గఱవు రాక
మనుజు లొండొరులతో మత్సరంబునఁ బోరు
టధికమై సర్పంబు లాదిగాఁగఁ
గ్రూరజంతువు లతిఘోషంబు వెట్టుట
గాలియుఁ జిచ్చు లగ్గములగుట
ఆ. భూతములు పిశాచములు రేఁగి పట్టుట
యల్పకారణముల నైనచావు
గలుగుటయును నాపదలు వీనిదైవజ్ఞుఁ
డగు పురోహితుండు నడఁపబోవు. 331

విద్వాంసుఁడు

క. సన్నుతి వడయఁగఁ దివిరి న
యోన్నతి నుచ్చాసనమున నునిచి ధనంబుల్
మన్నించి యిచ్చి నృపతులుఁ
విన్నపము పనేమి యండ్రు విద్వాంసునకున్. 332

ఆ. చటులసింహశరభశార్దూలగజముల
వశ్య మొందఁ జేయ వచ్చు ననిన
నరయ మిగులఁ దజ్ఞు లగువారకునెల్ల
నవనిపతులు వశ్యు లగుట యెంత. 333

పంచతంత్రి



క. ఎవ్వరు శూరులు సేవకు
లెవ్వరు విద్వత్ప్రసిద్ధు లెవ్వరు దగువా
రవ్వసుధాధిపుసంపద
కవ్విధమున నర్హు లగుదు రది నిజ మరయన్. 334

చ. పతి సుఖగోష్ఠి సేయునెడఁ బన్నుగ వారమునందుఁ బాఁడి స
మ్మతముగ రాజుపక్షము సమర్థముఁ జేయుచుఁ బల్కుటొప్పుఁ ద
త్పతిపనిపైనఁ దద్వచనభంగి యెఱింగి వినిశ్చితార్థసం
గతిఁ గడు సాధురీతిఁ బలుకందగు వాగ్మిత యుల్లసిల్లగన్. 335

రాయబారప్రకారము

క. దూరపుఁబనులకు మంత్రికిఁ
బోరా దటు గాన నతనిఁ బోలెడివిప్రుం
భూరిగుణాఢ్యుని దూతగఁ
గోరి నృపాలుండు పనులు గొనఁగావలయున్. 336

కామందకము