పురోహితనీతి
చ. నృపతిపురోహితుండు నృపనీతివివేకదగ్ధుఁడై త్రయీ
నిపుణుఁడు నై తనర్చి ధరణీపతి కెప్డు హితాభిలాషి యై
రిపు నృపకర్మభేదనధురీణత శాంతికపౌష్టికక్రియా
విపులమనీషఁ జేయఁదగు వేడ్క దలిర్ప గృహప్రయోక్తయై. 323
కామందకము
క. ధీరుఁడు ధర్మాధర్మవి
శారదుఁడు బహుశ్రుతుండు సమచిత్తుఁడు వా
ణీరమణీకృతవదనస
రోరుహుఁ డనఁదగునె నీపురోహితుఁ డధిపా. 324
క. తనయింటిచేటు పరులకు
వినిపింపఁగఁదగదు కార్యవేళనె తక్కన్
వినఁగఁ బురోహితుఁ డర్హుఁడు
విని చక్కంజేయుఁ దనదువిద్యామహిమన్. 325
సభాపర్వము
క. పోఁడిమిఁ బౌరోహిత్యం
బేఁడును మాఠాధిపత్య మింపెసఁగంగా
మూఁడుదినంబులు చేసిన
వాఁడు సుమీ ఘోరనరకవాసుఁడు మీఁదన్. 326
పంచతంత్రి
యాజ్ఞికుఁడు
క. జననుత నీయజ్ఞమునం
దనవరతనియుక్తుఁ డైన యాజ్ఞికుఁడు ప్రయో
గనిపుణుఁడై యేమఱకుం
డునె నిజకృత్యముల నెప్పుడును సమబుద్ధిన్. 327
సభాపర్వము
జ్యౌతిషికుఁడు
క. క్షితినాథ శాస్త్రదృష్టి
ప్రతిభను దివ్యాంతరిక్షభౌమోత్పాత
ప్రతికారు లగుచు సన్మా
నితులై వర్తింతురయ్య నీదైవజ్ఞుల్. 328
సభాపర్వము
క. జాతకయాత్రాప్రశ్న
ఖ్యాతఫలగ్రంథగణితగణచతురధిక
స్ఫీతశతచక్రనిపుణ
జ్యౌతిషికులు గలుగవలయు నవనీశునకున్. 329