చ. కొనగొని కొండమ్రుచ్చులఁ జకోరములన్ శుకశారికావళిన్
బెనుతురు భూపతుల్ విషము వెట్టినయన్నముఁ జూచి యోలిఁ జ
య్యననవి పెంటిక ల్విడువ నక్షులు మూయఁగఁ గూయుచుండఁగాఁ
గని కుటిలప్రయోగములు గాంచుటకై నృపమంత్రిశేఖరా. 259
చారుచర్య
క. అనుభావ్య మైనయన్నం
బనలమునకుఁ బక్షులకు సమంచితబుద్ధిన్
మునుము న్నిడి తచ్చిహ్నము
లొనరఁ బరీక్షింపవలయు నుచితక్రియలన్. 260
వ. అది యెట్లనిన 261
క. నల్లనిపొగలును మంటలుఁ
బెల్లగుఁ జిటజిటలుఁ బుట్టుఁ బెద్దగు నగ్నిన్
ద్రెళ్ళిపడి చచ్చుఁ బక్షులు
మొల్లంబగు నవ్విషాన్నమునఁ జిత్రముగన్. 262
సీ. నీరు గ్రమ్ముటయును నీరు దివుచుటయు
వడిఁ జల్లనవుట వివర్ణమగుట
విపులచిహ్నంబులు విషవిదగ్ధంబగు
నన్నమునకు నీలి యరయవలయు
కడుఁగాఁకతోడఁ బైఁ గ్రమ్మునల్లని నురు
గూరక శుష్కమౌఁ గూరగాయ
సంస్పర్శగంధరసంబులఁ జెడుచాయ
మిక్కిలి యగునొండెఁ దక్కువగుచు
ఆ. మండలంబుగాఁగఁ నొండొండబుగ్గలు
పొడమి ఫేనపటల మడరుచుండు
నూర్ధ్వగతము లగుచు నొనర రేఖలు వాఱు
సకలవస్తువులు విషప్రయుక్తి. 263
గీ. రసముమీఁదట నీలవర్ణములు పాలఁ
దామ్రవర్ణము తోయమద్యములమీదఁ
బికనిభంబులు శ్యామముల్ పెరుగుమీఁది
బొడముఁ బొడవగు రేఖలు నడుమనుండి. 263
క. కడుమాడు చిముడు నుడుకుచు
నడగొను శ్యామాయమాన మగు నార్ద్రంబున్
గడుకొని శుష్కము లెల్లను
వడిఁ బ్రవిశీర్ణంబు లై వివర్ణము నొందున్. 264
కామందకము
క. పరుస నగు మృదులవస్తువులు
పరుసనివస్తువులు మృదులభావము చెందున్
ఉరువిడి విషదగ్ధకమున
కర మరుదుగ నల్పజంతుఘాతం బొదవున్. 265