పుట:Sakalaneetisammatamu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. సమబలుఁడును మర్మజ్ఞుఁడు
సమరాజ్యసమన్వితుండు సదృశోద్యముఁడున్
సమధనుఁ డైనభటుం బతి
సమయింపండేని తాన సమయు నతనిచేన్. 175

పంచతంత్రి



క. తలవర్గము సామంతుల
బలముల కగ్గలము గల నృపాలున కొప్పున్
బలిమి పెఱకుమతి కాజ్ఞా
బలసంపద కెంతదవ్వు బద్దెనరేంద్రా. 176

బద్దెననీతి



క. ఏమిపనిఁ బంచునొకొ న
న్నేమిట నలుగునొకొ యంచు నెప్పుడుఁ దనయా
జ్ఞామహిమ కులుకుచును మది
సామంతులు గలిగిరేని జనపాలుఁ డగున్. 177

ఉ. రాజులసమ్మతిం దరతరంబులప్రాఁతల భక్తియుక్తులన్
రాజితశస్త్రధారులఁ బరాక్రమవంతుల నప్రమత్తులన్
భోజనహేమవస్త్రపరిపుష్టుల హృష్టుల నైనవారిఁగా
నోజ నొనర్పఁగా వలయు నొద్దను బాయక యుండ భృత్యులన్. 178

ఉ. చేరఁగనీరు మున్ను దమచే మృతిఁ బొందివారివారి ము
న్నీరస మెత్తి మన్కికొఱ కిష్టతఁ దాల్చినవారి బన్నముల్
కూరగఁబడ్డవారిఁ దమకుం గడుభక్తులు గానివారి ఘో
రారులదిక్కువారి ననయజ్ఞు లనందగువారిఁ బార్థివుల్. 179

క. అడఁపగలంతియ బానసి
యొడలంటుల వైద్య మొద్ద నుండుట తనకుం
గుడువఁగఁ బెట్టుట యనుపను
లడరఁగ నాప్తు లనె పంచు నధిపతి సుమతీ. 180

పురుషార్థసారము



గీ. ఎవ్వఁడభ్యంతరస్థుల నెడులచేసి
మిగుల లాతుఁ జేరంగఁ దిగుచుఁదగిలి
వాఁడు వారలచేఁ జెడు వలను దప్పి
యలుక గృధ్రముఁ డను రాజునట్ల పొలియు. 181

ఆ. దీనికొఱకుఁ గాదె తివిరవంశజులైన
నేలికొంద్రు రాజు లేల యనిన
మానుగాఁగ నాదిమధ్యావసానముల్
వార లొక్కరీతివారు గాన. 182

ఆ. ఎవ్వఁడొద్ద నుండ నేపార సితపక్ష
చంద్రకళయుఁబోలె సంతతంబు
వెలయ రాజ్యలక్ష్మి వృద్ధిఁ బొందుచునుండు
నతఁడ [మంత్రివర్యుఁ]డవనిపునకు. 183

పంచతంత్రి