Jump to content

పుట:Sakalaneetisammatamu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ. పగఱవలనిబాధ పడకుండ రక్షించు
రాజు లేని చోట మనుజు లోజ లేక
పొలసిపోదు రబ్ధిపూరంబులోపల
నావికుండు లేని నావపగిది. 119

చ. బలియుఁడు నీతిమార్గపరిపాలుఁడు భూపతి గాకయుండినన్
దలపఁగఁ గర్ణధారరహితం బగునావయుఁ బోలె నుండు ని
య్యిలఁ బ్రజ గాన నట్టి ధరణీశుఁడు పెన్నిధి భిన్నమై నయ
క్కలమునుబోలె వేగమె తెగన్ విడువందగు నెన్నిభంగులన్. 120

క. పాడి గలపతి వసుంధర
వేడుకఁ బరభూమిప్రజయు వెలయఁగనెక్కున్
బాడి చెడ నడుచుపతి ధర
పాడుగఁ జెడిపోవుఁ బ్రాఁతప్రజయైన వడిన్. 121

పంచతంత్రి



ఆ. పచ్చ లాయకట్లఁ బఱిబోవు నారంభ
మడవిగలయు సుత్తె కడగఁబొలము
పంటమీఁద నరులపైడెత్త గఱవగుఁ
బ్రజలచేటు భూమి పాడుసేయు. 122

నీతిసారము



క. ప్రజఁ జెఱచి కూడఁబెట్టిన
నిజధన మది వలయు వ్యయము నిచ్చలుఁజేయన్
బ్రజయును ధనమును బొలిసిన
భుజబలమున నిలువఁదలమె భూపతికెందున్. 123

పురుషార్థసారము



క. న్యాయపుటరి తలపూవులు
గోయుట నట లెస్స తగదు కువలయపతి క
న్యాయ మరి మ్రాను వొడిచినఁ
గాయలు వెసఁ గోయునట్టి కరణి దలంపన్. 124

నీతిభూషణము



ఆ. ప్రజ నజంబుఁబోలెఁ బట్టి విత్తమునకై
తగిలి చంపెనేని దానఁదృప్తి
యణఁగ దొక్క మాటి కగుఁగాని ధారుణీ
శునకు మఱియు వలయుననిన లేదు. 125

క. విను గోపాలనిక్రియఁ గాఁ
పనుధేనువుచేత విత్త మనుదుగ్ధంబుల్
గొనవలయు నిత్య మొయ్యొ
య్యన ఫలరోషాధికముల నవనీశునకున్. 126

పంచతంత్రి



క. రాజులకు బలము విద్యయు
నాజులరిపు గెల్వఁగాక యపరాధుల న
వ్యాజమునఁ బ్రజలఁ జంపఁగ
యోజించెనె బ్రహ్మరాజు నొండనఁ దలమే. 127

నీతిసారము