Jump to content

పుట:Sakalaneetisammatamu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

వెలుగుఁబెట్టి చేను గలయంగఁ బండిన
నుఱిపిఫలము గొన్న తెఱఁగుదోప
నాజ్ఞ వెట్టి ప్రజల నరియప్పనంబులు
గొనఁగవలయు రాజకుంజరుండు.

82


క.

పసరముఁ బసరము పులిఁబులి
బిసరుహసంభవునిదృష్టి పెంపెంతమహిన్
బసరముఁ బులిఁజేయుఁబులిం
బసరముగాఁ జేయు నృపతి బలమదిగాదే.

83


క.

అజమైన సింహమగు భూ
భుజుమన్నన గలుగునట్టి పురుషుం డరయన్
అజమగు సింహంబును భూ
భుజుమన్ననలేనియట్టి పురుషుఁడు దలఁపన్.

84

పురుషార్థసారము

క.

బలవంతుఁడు మన్నించిన
బలహీనుఁడు బలియుఁ డనఁగఁబడు ధారుణిలో
వలరాయఁడు చేపట్టిన
యలరులు బాణములు గావె యౌభళకందా.

85

నీతితారావళి

ఆ.

ఆజ్ఞలేని నృపుఁడు నరయఁ జిత్తరువులో
నున్న రాజుఁ జూడ నొక్క రూప
ఆన ద్రోయు సుతుని నైనను దండింప
కున్న రాజ్యమేల యుండుఁ జెడక.

86


క.

పనిలేనియాన గర్వం
బునబొడిచిన మగుడ నాన పొడిచినవారిన్
జనపాలుఁడు దండింపం
జనుఁదగుక్రియ నానఁ ద్రోయుజనులనవోలెన్.

87


క.

దండము లేకున్నను బ్రజ
లొండొరువుల నాక్రమింతు రుచిరస్థితిమై
నుండవు వర్ణాశ్రమములు
దండింపని భూమిపతికి ధర యేర్పడునే.

88


ఉ.

జూదము వాదుఁబన్నిదము జోకయు మందటకూటసాక్షి మ
ర్యాదలులేమి గబ్బుమెయి నానకు నిల్వక రాజసంబునం
బేదల నొంచు దప్పుగొని పెట్టమినాదిగ వంచనక్రియన్
గా దడఁకించుదుర్జనులఁ గావనిరా జిల యేలనేర్చునే.

89

నీతిసారము

ఉ.

మండలనాథునాజ్ఞకు సమస్తజనంబులు నోడిపాడిమై
నుండక మేర దప్పి బలియుం డబలున్ మననీక పెద్దమీ
న్కొండికమీను ద్రావుక్రియఁ గ్రొవ్వునఁ జంపుచు నుండిరేని య
మ్మండల మేల యుండు మతిమంతులకుం బరపక్షభైరవా.

90

బద్దెననీతి