Jump to content

పుట:Sakalaneetisammatamu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

కావున దుర్గంబ రాజ్యంబునకు చిరకాలనిర్వాహకం బదియును భూస్థలంబున
నిర్మింపంబడిన ప్రాకారంబు స్థలదుర్గంబు, జలవనపర్వతంబులు స్వభావ
దుర్గంబు లయ్యును బ్రాకారంబు లేకయున్నఁ బరులకు గోచరంబు లగు నీ చతు
ర్విధదుర్గంబులందును విచిత్రగోపురాట్టాలకంబులును, ననేకదారుమయ
యంత్రనియంత్రితంబులును, నానాస్త్రశస్త్రశిక్షాదక్షవీరభటప్రాయంబులును,
బహుధనధాన్యసంగ్రహంబులును, ననేకజనసంచారక్షమాంతరాళంబు
లును, దృణకాష్ఠజలసమృద్ధంబులును, బ్రవేశనిర్గమమార్గనిరోధరహి
తంబులుగా నొనర్పవలయు. నట్లు గాని దుర్గంబు పందిగృహంబు మఱి
యును.

53

నీతిసారము

ఉ.

శైలసరిన్మరుస్థలవిశాలవనాశ్రయణంబు నున్నతా
ట్టాలకమాత్రగోపురదృఢస్థలవప్రశిరఃప్రఘాతముం
గాలసహంబు ధాన్యధనకాష్ఠజలాదికమున్ మహాభటో
త్తాలభుజార్గళంబును బ్రధానకవాటము దుర్గ మెమ్మెయిన్.

54


క.

గిరులును దరులును జలములు
మరుభూములు మిగుల నైన మనుజేశునకున్
దిరముగ దుర్గము సేయుట
వెర వగు వైరులకుఁ జేర విషమం బగుటన్.

55

కామందకము

చ.

బహుధనధాన్యసంగ్రహము బాణశరాసనయోధవీరసం
గ్రహము నిరంతరాంతరుదకంబునుఁ జాలఁగ నింధనంబు సం
గ్రహము ననేకయంత్రములు గల్గి యసాధ్యములై ద్విషద్భయా
వహము లనంగ నొప్పునె భవత్పరిరక్ష్యములైన దుర్గముల్.

56

సభాపర్వము

చ.

సముచితవస్తుసంగ్రహము సాలినదుర్గము లిచ్చు నందు ధా
న్యము మిగులంగఁ గూర్పఁదగుఁ బ్రాణము నిల్వఁగ ముఖ్యహేతువై
కొమరగు గానయందు నిడు కోద్రవముల్ సెడకుండఁ బెట్ట ధా
న్యము పెఱధాన్యమైన నవిలంబగతిం జనుఁ గ్రొత్త సేయఁగన్.

57

నీతిసారము