సీ. నిత్యనైమిత్తికనియమమతాదుల
విపులధర్మంబు గావించునపుడు
కర్శనగోత్రజక్రయవిక్రయాదుల
చేత నర్థంబు లార్జించునెడల
స్మరకూచిమారపాంచాలాదిమతములఁ
గామసౌఖ్యము లందు కాలములను
యమనియమాదివిఖ్యాతకారణములఁ
గైవల్యమార్గంబు గాంచునెడల
ఆ. మఱియు సూక్ష్మవాక్యమార్గంబులందును
నధిక మగుచు నున్న యట్టి పనుల
వెరవు లేనియట్టి పురుషుండు నేర్చునే
ఫలము నొంద నీతిపరుఁడు గాక. 37
ముద్రామాత్యము
చ. అరయఁగ శబ్దశాస్త్రము లనంతము లాయువు కొంచె మందులోఁ
గరము ఘనంబు విఘ్నములు గావున సారము పట్టు టొప్పగున్
బరఁగ నసారము ల్విడిచి పాలును నీరును నేర్పరించి నే
ర్పరుదుగఁ బాలు పుచ్చుకొను నంచతెఱంగున భూవరాగ్రణీ. 38
పంచతంత్రి
క. ధర్మార్థశాస్త్రతత్త్వవి
నిర్మలమతి గాక యెట్టి నీతికథాస
ద్ధర్మము దెలియసమర్థుఁడు
దుర్మతి యే మెఱుఁగు శాస్త్రదూషణఁదక్కన్. 39
క. మతిమంత్రులయంత్రంబులు
ప్రతియంత్రక్రియనెగాని పాయవు దృఢకీ
లితఘనఘటితకవాటము
ధృతిఁ దాలముచేతఁ గాక తెఱవగ నగునే. 40
ముద్రామాత్యము
క. ధరనొప్పు నీతిమార్గము
పరికింపఁగఁ దిరుగు మంత్రిపని మంత్రము లే
కురువిషభుజగము పట్టిన
కరణి సుమీ యౌభళార్యు కందనమంత్రీ. 41
నీతితారావళి
క. రాజు లమాత్యులు మొదలగు
భూజనులకు నీతిపథము పొత్తగు నందే
యోజఁ బరికింప నెవ్వరు
తేజము గం డ్రావిధమ్ముఁ దెలిపెద వరుసన్. 42
ముద్రామాత్యము
క. పెక్కేల నీతిశాస్త్రముఁ
దక్కక నెవ్వండు సదువు ధర నెవ్వఁడు పెం
పెక్కఁగ నిము నాతఁడు దాఁ
జిక్కఁడు సురపతికి నైన సిద్ధం బెందున్. 43
పంచతంత్రి