క. అమరఁగ వేల్పులచేఁ గ
బ్బము చెప్పియ కాదె వరము పడసిరి మును బా
ణమయూరాదులు సత్కా
వ్యముఁ జెప్పినఁ బడయరాని వస్తువు గలదే. 24
శా. బహ్వర్థప్రతిపాదకంబు లయి శబ్దంబుల్ నిరాయాసభా
వాహ్వానం బొనరింపఁగా రసనవీనాపాదనంబుల్ చతు
ర్బాహ్వంఘ్రిప్రభవాపగామహిమ దోపం జూప లేకుండినన్
జిహ్వాకండువుపొంటె మేలె కవిరాట్ఛిల్పంబు లల్పంబులే. 25
సీ. గ్రామ్యంబు దుస్సంధి కాకు విరోధోక్తి
పొల్ల సంక్లిష్టంబు జల్లిపొదవు
వ్యర్థబంధంబు నిరర్ధంబు పునరుక్తి
దోషం బలంకారదూషణంబు
రసవిరుద్ధము క్రియరాహిత్య మస్పష్ట
భావంబు గణయతిభంగ శబ్ద
భంగంబు లెఱుఁగక సంగతంబుగ వట్టి
మాటలు పురికొల్పి మచ్చరమునఁ
గీ. బెనచి వడ్లును బెరువును బిసికినట్లు
కెలను నవ్వంగ బిలిబిలికృతులు సెప్పి
వాదు లడువంగఁ బఱతెంచువారు కవులె
గోపికాజాలసుఖలోల గోపబాల. 26
చ. తెలుఁగని చెప్పి సంస్కృతము తీపును నాఱడిఁబుచ్చి శబ్దముల్
తెలుఁగును గాక యేసభలఁ దెల్పఁగరాని యపప్రయోగముల్
పలుమఱు గ్రుచ్చి వా దడువఁ బాడుచుఁ గబ్బపు దబ్బముండ్లచేఁ
బెలుచన కర్ణముల్ పొడుచు బేలుఁగవిం గవిగాఁ దలంతురే. 27
చ. పలుకులు గొన్ని పేర్చి వడిఁబ్రాసము నందుల దోఁప నేర్చు భం
గుల నెటువంటి పద్యములు గూర్చినఁ గూర్పఁగ వచ్చుఁగాక తద్
జ్ఞులు వొగడం బ్రబంధములు చోద్యము పుట్ట రచింపవచ్చునే
చెలమలు ద్రవ్వినట్లగునె చెర్వులు గట్టుట భూతలంబునన్. 28
నీతితారావళి
సీ. సుందరీనఖముఖసుఖదవీణాతంత్రి
ముసలంబు గొని పెట్టు మోఁదినట్టు
మృదుతంతుబంధనాస్పదనప్రసూనంబు
కఠినంపురజ్జునఁ గట్టునట్లు
అర్భకనఖదారణారహకదళికా
ఫలము గొడ్డఁటఁ గొని పాపినట్లు
చంద్రికారసబిందుసదృశముక్తామణి
బలితంపుఁ గరసానఁ బట్టునట్లు
గీ. చతురకవిసూక్తరసభావజనితమధుర
సకలకావ్యంబు కేవలశాస్త్రతర్క
కర్కశోపలసదృశవాక్పరుషతలను
గుతిలపడ కేలసైరించు గోపబాల. 29
మదీయము