పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68 సాహిత్య మీమాంస

అని దుర్యోధనుడుకూడా పశ్చాత్తప్తు డాయెను. యుద్ధసమయములందు మోసము, వంచన, భ్రాంతి మొదలగువాటిచే చోదితములగు కృత్యములు ఎన్నో జరుగుచుండును. అంత:కలహము లాపజ్జనకములని చూపుటకు కవులిట్టి ఘోరకర్మల కల్పింతురు. మహాభారతము ఇతిహాసమ (History)ని యెంచేవారి కివి అసంబద్ధములని తోచదు. అది యొక కావ్యమని యెంచేవాళ్ళకే. ఇట్టి కార్యపరంపర భయంకరవ్యాపారమని తట్టును. జ్ఞాతివిరోధమున భయంకరపరిణామము చేకూరుతుందని వారు తెలుసుకొందురు.

భారతము పురాణమని యెరుంగునది. జనులయందు ధర్మబీజముల నాటి సంఘములయందు ధర్మబుద్ధి ప్రబలునట్లు చేయడమే పురాణముల ముఖ్యోద్దేశము. అట్లు చేయబూనునపుడు కొన్నిచోట్ల హత్యాకాండము అవసరమగును, కాని ప్రధానాంశము కాకపోవడముచేత అది యేమూలనో మట్టుపడియుండును. దృశ్యకావ్యములం దట్టివి కల్పిస్తే అవి ప్రదానములగును, కావున ధర్మబుద్ధిని మట్టుపరచును. పురాణములందన్నననో అవి ప్రక్కలకొరిగి ధర్మానురాగోదయమును అరి కట్టవు. పుష్కలకార్యప్రపంచమున వీటికి ప్రాముఖ్య ముండదు. ధర్మానురక్తి జనుల జీవితముల నియమితములుగను సుశిక్షితములుగనూ చేయును.