పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70 సాహిత్య మీమాంస

దీనికి కారణము ఆతని యందలి ప్రేమయే. పతిచెంతనున్నచో ఆమె కెట్టి కష్టములూ కష్టములుగా తోచలేదు, భీతి అసలే లేదు. ఋష్యాశ్రమముల వీక్షించు నపుడు శ్రీరామున కెట్టి యానంద ముదయించెనో సీతకు కూడా అట్టి యానందమే కలుగుతూండెను. ఆర్యుల మతమున సతి పతికి నీడ వంటిది. అతనికి సుఖావహమయినవన్నీ ఆమెకు సుఖావహములు - ఆశ్రమవాసుల కష్టముల తొలగించి శ్రీరాముడు వనస్థలుల యందు శాంతిని నెలకొల్ప, అతని నాశ్రయించిన ప్రేమలత సీత ప్రేమకుసుమముల వెదచల్లుతూ అచ్చటి మునిపత్నులను మునికన్యలనూ ప్రేమాలాప ప్రేమాచరణపాశములచేత బంధిస్తూండెను - దండకారణ్యమున గ్రుమ్మరువేళల శ్రీరాముడు శాంతి సముద్రమున నోలలాడుచుండ, సీత ప్రేమస్రోతమున నీదుచుండెను.

సీత ప్రేమదూత అననొప్పు; ఆమె ప్రేమ విశ్వవ్యాపి - శ్రీకృష్ణుని ప్రేమ రాధారూపము ధరించినట్లు శ్రీరాముని ప్రేమ సీతారూపము గైకొనెను. అశోకవనియందలి క్రూర రాక్షసులు సయిత మా ప్రేమకు వశులై చేతులు జోడించి ఆమెకు మ్రొక్కసాగిరి. ప్రేమప్రభావమున శత్రులు మిత్రులౌట చూచినారా? ఆమె ప్రేమయొక్క నిజస్వరూపము గోదావరితీరమందలి పంచవటియందు కనబడును. అచ్చటి పర్ణశాలను సీత నందనవనముగా నొనర్చుట వల్ల తజ్జీవకోటి ఆమెను అనుపమప్రేమతో గారవిస్తూండెను. హరి