పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64 సాహిత్య మీమాంస

యెంచే రుచి సురుచి కానేరదు. కృష్ణకాయునొకని నిర్దయునిగనూ పామరునిగనూ చిత్రించి శ్వేతముఖుడు పరమానంద భరితుడాయెను. ఇందు షేక్స్‌పియ రొక్కడే దోషి కాడు, ఆతని సమకాలీనులందరూ అట్టి రసికులే. ఇప్పటికినీ అట్టి రోచకులు మనలో లేకపోలేదు. ఈరుచి గిట్టని వారప్పుడూ ఉండియుందురు, కాని వారిమాటల పాటించు వారెవరు? ప్రతిభావంతులు పరోపదేశమును పాటింతురా?

ఆర్యనాటకములలో వేణీసంహారమున కీ "విషయ నిర్వాచన" దోషమే పట్టింది. భీముడు "ప్రల్లదు దుస్ససేను రుధిరంబు సురంబునువ్రచ్చి త్రావు" చున్నానన్నప్పుడును, "ప్రెళ్ళుమనన్ సుయోధనుని పెందొడలన్ గదనుగ్గుచేసి" తద్రక్తాక్తములగు చేతులతో "ఏరక్షస్సునుగాను" అంటూరంగ స్థలమున ప్రవేశించి అతడు ద్రౌపదీ వేణీసంహార మొనర్చునప్పుడున్నూ ఈదోషముందని ఒప్పుకొనవలయును.

                1. తల్లడ మంద కౌరవశతంబును పట్టి అనిన్మధింపనా?
                   ప్రల్లచు దుస్ససేను రుధిరంబు నురంబును వ్రచ్చిత్రావనా?
                   పెళ్ళుమనన్ సుయోధనుని పెందొడలన్ గద నుగ్గు సేయనా?
                   ...........................................................................

               2. ఏరక్షస్సునుగాను భూతమునుగా నేలామృతేభాశ్వవి
                  స్తారాంగంబులక్రింద దాగ? హతశేషక్ష్మాపులారా! ద్విష
                  చ్ఛారీరక్షతజాభిషిక్తతనుడన్ సంలంఘితోరు ప్రతి
                  జ్ఞారత్నాకరుడైన క్షత్రియుడనే శంకింప మీ కేటికిన్.