పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

61 రక్తపాతము

కావింపవలసినది ఆత్మహత్యయని ఆనాటకములు దృష్టాంతీ కరించును. ఇది కన్నవారికీ విన్న వాళ్ళకూ ఆత్మహత్యయం దాదారము కల్గుట ఆశ్చర్యముకాదు. ఆత్మహత్య అనహన్ మని ఆర్యసాహిత్యము పలుమా రుపదేశించును. ఇట్టి సంప్రదాయమునకు విపరీతములు ప్రతికూలములు నగు బోధన లాంగ్లసాహిత్యమందు కలవని నానమ్మకము.

ఆంగ్లసాహిత్యమందలి పక్షపాతము.

ఆంగ్ల సాహిత్యమందలి అభిమానముచే అది చెడ్డదన్న మాట మనవారు పెడచెవిని పెట్టుచున్నారు. నింద్యమగు దానిని నిందిస్తే సైపజాలక, అట్టి నింద్యవిషయములు ఆర్యసాహిత్యమున నేమూలనైనా ఉన్న వేమో అని ప్రయాసపడి వెదకుతారు. మన సాహిత్యమునం దట్టి దోషము లున్నవనుకొన్నా, అంతమాత్రమున ఆంగ్లసాహిత్యమందలి ఆదోషములు పరిహరింపబడునా? తనకంటిలో పువ్వున్న వాడు ఎదుటి వాని కంటిలోని కాయనుచూపినంతనే తనలోపమునుండి తప్పుకొనజాలునా? హలధరునియందు దోషము నెంచినంత మాత్రాన జలధరుని యందలిదోషము తగ్గునా? "వెనిసు వర్తకుడను" నాటకములోని ఛురికావ్యాపారము దోషకలితమన్నతోడనే మహాశయు డొకడు రామాయణములోని అగ్నిప్రవేశము దోషముకాదా అని ఆక్షేపించెను. అగ్ని పరీక్ష కేవలపరీక్షయే - ఆయగ్ని చ్ఛటల సీత భస్మీభూత కాలేదు. ఏనాటకమందైనా నాయకుడోనాయికో నిప్పులోబడి