పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60 సాహిత్య మీమాంస

దోషకలితములని యెరిగియు భారతీయకవులు వాటినే ఆరగించుచూ తమసాహిత్యము పేరుప్రతిష్ఠల విడనాడదగునా? ఇతర సాహిత్యముల ననుకరింపవచ్చును, కాని తద్దోషముల పరిహరింపవలదా? ఆర్యసాహిత్యము చూడండి - దానియందిట్టి దోషము కానరాదే! స్వదేశీయమైన అనర్ఘ రత్న భాండారమును అధ:కరించి అవలక్షణరేఖా సమన్వితములగు విదేశీయమణులవిడంబింపనేల? తన్మూలమున మన సాహిత్యమునకు ఇంటావంటాలేని దోష మావహింప జేయనేల.

వియోగాంత నాటకముల దుష్పరిణామము

ఆంగ్లవిద్యాభ్యాసకుల మనముల నలరించు కవి షేక్స్‌పియర్. అతని నాటకములలో వియోగాంతములే మిన్నలు, వాటిని చదివిన జనసంఖ్య తక్కిన నాటకములకు లభింపదు - కళాశాలలలో నున్నప్పుడే యువకుల రుచులు వాటిచే కలుషితములగును. పరీక్షలలో కడతేరని విద్యార్థుల దృష్టి సాధారణముగా ఆత్మహత్యదెసకు బోవును. కాలక్రమమున దానియెడ వెగటు తగ్గుటచే అది పాపమనే తోచదు. షేక్స్‌పియరు గ్రంథములయందు ఆత్మహత్య మహాపాపమని ఎచ్చటను విశదముగా వివరింపబడలేదు, సరేకదా అది గౌరవదాయక మనియే ప్రశంసింపబడియెను. *[1] భగ్నకృషులు

  1. * కొన్నిచోట్ల ఆత్మహత్య ఆచరింపగూడదని లేకపోలేదు, అది మాటవరుస కన్నదేకాని సేనామంది ఆత్మగౌరవము నిలువబెట్టుటకు ఆత్మహత్య అవలీల కావించినారు.