పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24 సాహిత్య మీమాంస

క్యమువల్ల దైవీకల్పన ప్రచ్ఛన్నమూ మలినమాయెను. ఆర్య సాహిత్యమున దివ్యప్రకృతిసుందరప్రభాచ్ఛటలమధ్య అందలి పాశవప్రకృతి ప్రజ్వరిల్లదు. శ్రీరాముని పుణ్యచిత్రప్రభావమున రావణుని పాపచిత్రము పాతువడింది; శ్రీరామభరతుల గాఢ స్నేహప్రభావమున కైకేయీ మందరల పాపచిత్రములు రూపుమాసినవి. ఆపాపకల్పన శ్రీరామభరతచిత్రములను కౌసల్యాసీతల చిత్రములనూ ఉజ్వలప్రభాభాసమానములుగ జేసి తాను నిబిడాంధకారమున విలీన మైనది.

శ్రీరామయుధిష్ఠిరులందు అలౌకికధర్మాదర్శము లుండిన లాగున తక్కినరాఘవులయందునూ పాండవులందునూ అలౌకిక భాతృప్రేమ కద్దు; పురు పరశురాములందు అలౌకిక పితృభక్తికద్దు. పరశురాముడు పితృభక్తి ప్రేరితుడౌటనే కదా తండ్రియాజ్ఞను మన్నించి తల్లి తల ద్రెవ్వనేసెను? ఆమెను తిరిగీ జీవింపజేయు సామర్థ్య మాతనియందు లేదు, అట్లు జరుగు నను ఆశయు నున్నట్లు తోచదు. ఆతని చరితమును విన్న వారి హృదయములందు పితృభక్తి గౌరవ మినుమడింపదా? కవి యుద్దేశము సఫలము కాలేదా? మహాకావ్యరచనాచాతుర్యము చూపుట కిట్టి ఘటనాసమావేశ మొనర్పవలయును, అట్లు చేయకున్న రసస్ఫూర్తి గాంభీర్యమున్నూ జనింపవు. పితృభక్త్యావేశముననేకదా ఇరువదియొకసారి యాశూరుడు క్షత్రియకులనాశ మొనర్చెను. పితృ దేవతలను సుఖపెట్టుటకు భగీరథుడెంత కష్టసాధ్యమైన కార్య మొనర్చినాడు! పంచ