పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158 సాహిత్య మీమాంస

లేదు. అందుచేత ఆ ఘటనాపరంపరయందు రక్తము స్రవించినా అది యాత్మబలి కానేరదు. అందుకే మారువేషమున పోర్షియాను ప్రవేశపెట్టి రంగరహస్యమును కల్పించి కావ్య కల్పన సమాప్త మొనర్చెను.

రక్తపాతము చూడదలచినవారు పరశురాముని మాతృహత్య చూడండి - అతడు మాతృహత్య కెందుకు కడంగినాడు? పితృవాక్య పరిపాలనమునకే కదా ? మన శాస్త్రములయందు కర్తవ్యాదేశము రెండు విధములు - శాస్త్రాదేశ మొకటోది, గురుజనా దేశము రెండోది. శాస్త్రాదేశము రెండింటిలో బలవత్తరము. శాస్త్రజ్ఞానపటిష్ఠ చేకూరేదాకా గురుజనాదేశము నిర్వహించి తీరవలెను, అంతవరకూ పిత్రాజ్ఞ అవశ్యాచరణీయము. దీనిని దృష్టాంతీకరించుటకు పరశురాము డట్లొనర్చెను.*[1]

  1. * శాస్త్రజ్ఞానము దృఢమై, పెద్దల యానతి అందుకు విపరీతమైనప్పుడు గురువుల మాట పెడచెవిని బెట్టి శాస్త్రాదేశమునే అనుసరించ వలయును. ఇందుకు ప్రహ్లాదుఁడు, భీష్ముడు నుత్త మోదాహరణములు.తండ్రియైన హిరణ్యకశిపు, తల్లి లీలావతి, ఎంత నొక్కిచెప్పినా ఉభయ తారకమగు హరిభజనము ప్రహ్లాదుడు మానడాయె. పరమభాగవతోత్తము డగు నారదుని ఉపదేశమునం దతనికి దృఢమైన నమ్మకము కుదిరింది. సర్వశాస్త్రోపదేశసారము భగవద్భిక్తియే, చూడండి -

                      "ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్య చ పున:పున:
                        ఇదమేకంతు నిష్పన్నంధ్యాయే న్నారాయణం సదా
                        చదివి చర్చించిన సకల శాస్త్రములు
                        భక్తియౌ ముక్తికి పరమసాధనము."

    అంబుజోదరు దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్తచిత్తుడు కాబట్టి ప్రహ్లాదుడు తండ్రియాజ్ఞ నుల్లంఘించెను.

    అంబను పెళ్ళిజేసుకొమ్మని గురు వెంత బోధించినా భీష్ముడు - బహుశాస్త్రవేత్త - బ్రహ్మచర్యవ్రతము పూనుటకు ప్రతిజ్ఞ చేసినవాడు గనుక గుర్వాజ్ఞోల్లంఘనము చేసెను.

    ఈయిద్దరును శాస్త్రచోదితాచారవివేక ధనులు... కాబట్టి పెద్దల మాటలు పెడచెవిని పెట్టిరి, వీరిని ప్రమాణముగాగైకొని ప్రతీవారూ పెద్దలమాట జవదాటరాదు.