పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104 సాహిత్య మీమాంస

తీరును. బెనిడిక్ మానసకాసారమున ప్రేమతరంగము లుత్పన్నములైనతోడనే జనించిన ఆధీరత ఏమని చెప్పను? అతడు బియాట్రిస్‌కన్న ఎక్కుడు పిరికివాడగును. యువానురాగోన్మత్తయై రోసలిం డార్లెండోను చూడక క్షణమేని నిల్వలేకుండెను. సంయోగాంతములందు ప్రేమచిత్రములు, యౌవనోన్మాదేంద్రియ లాలసా కళంకితమూర్తులును కలవు, గాని, అవి ప్రేమచిత్రములలో లేక లాలసాచిత్రములలో నిర్ణయింప నలవికాదు. మదోద్రేకమున నాయికానాయకులు సాంఘికవ్యవస్థలను, కుటుంబనీతిబంధములను, తెంచుకొని యధేచ్ఛముగా వ్యవహరింతురు. డెస్‌డెమొనా యవ్వనమదమున విజాతీయుని, విమతస్థుని వరించి రహస్యముగా నింటినుండి లేచిపోయి, నిండోలగమున సిగ్గువీడి తనవృత్తాంతము ప్రకటించి, తన్నే లోకమనియెంచు తండ్రిగుండెలు పగులగొట్టి, ఆతని పరలోక ప్రాప్తికి హేతుభూతురా లయింది. జూలియట్ ఇమోజెన్లు కూడా పితురాజ్ఞోల్లంఘన మొనర్చినవారే. హెర్మియా లైసాండరుతో లేచిపోయి, అడవిపట్టి, తన్మూలమున పిత్రాజ్ఞకే కాక రాజనియమములకునూ వెలియైనది.

ప్రణయాలాపములు యువకుల కత్యంతప్రియము లనుటకు సందేహములేదు. ఆంగ్లనాటకములం దిట్టి వనేకము లున్నవి; వాటియందెల్ల యౌవనోన్మాదమే కాన్పించును. ఉన్మత్తులకు నియమోల్లంఘనము పరిపాటియ కదా! వారు నైతికశాసనములు లెక్కసేయరు, పాపమునకు వెరవరు.