పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100 సాహిత్య మీమాంస

గూర్ప యత్నించిన రీతిని కాళిదాసు రఘువంశమున అతి మనోహరముగ వర్ణించెను (పదమూడవసర్గ.) దాంపత్యప్రేమ సఖ్యభావమాధుర్యమిళితమైనచో తత్సుఖ మపూర్వమై నిర్వర్ణనీయమగును. ఆసుఖమును ఆనందమును జూరగొను నాసతో భక్తురాలు భగవంతుని సమ్మానపూర్వకముగ అర్చించునట్లు సీత భర్త నారాధింప నుద్యుక్తురాలగును. దారుణములగు ప్రతిజ్ఞావాగురుల దశరథు బడద్రోసి రూక్ష వచనముల నాతని అలయించిన కైక తత్పూర్వము దేవకార్య నిర్వహణమున ఆతనికి సాయమొనర్చి ప్రసన్నునిచేసుకొని ఆతనికృపచే రెండువరముల గడించింది. శ్రీకృష్ణుడు రాధ పాదముబట్టి అలకదీర్ప ఆతడు సాక్షాద్భగవంతుడని ఆమె పూజించును. భక్తిసమ్మిశ్రితమగు సఖ్యప్రేమమూలమున దాంపత్యసుఖ మనుభవించు యోగ్యత భారతరమణుల కబ్బెను. కావున తచ్చిత్ర మార్యసాహిత్యమున కల్పింపబడి దానికి వన్నె తెచ్చింది. ఈ యాదర్శసౌందర్యమున స్వర్గమందలి పవిత్రత నందనవనమందలి శోభ, మధుమాసమందలి మాధుర్యమును వెలయుచున్నవి.

పాశ్చాత్యప్రేమ స్వభావము

పాశ్చాత్య సాహిత్యమందలి ప్రేమ యెట్టిది? అది కేవల సఖ్యప్రేమయే. అం దార్యసతీప్రేమయందలి భక్తి, నిస్స్వార్థము, ఏకనిష్ఠ, ఆకాంక్షారాహిత్యము, గౌరవస్ఫూర్తియు కానరావు; ప్రేమాలాపము, మాధురి, దర్పము,