పుట:SaakshiPartIII.djvu/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశభక్తులు. వాకిటిలో దేశభక్తులు. రైలు స్టేషనులో దేశభక్తులు. నేల ఈనినట్లందఱు దేశభక్తులు-వందలు, వేయి లక్షలు. ఇందఱు దేశభక్తులు మన దేశమున నున్న తరువాత మన దేశమునకిక గొఱత యేమి? ఇంకను దేశమునకు దురవస్థ యేమి? ఏమియు లేదు, ఇదియే స్వతంత్ర్య రాజ్యము. ఇదియే స్వర్గలోకము"-

ఈ పానుగంటి వాక్యములు పరోక్షముగా క్రియాత్మక దేశభక్తి ప్రభోదించుచున్నవి. ఆంగ్లభాషావ్యామొహమున తెలుగు మాటాడుటకు నిష్టపడని వారిని ఆయన దులిపిన తీరు గమనించవలెను.

"మ్యావుమని కూయలేని పిల్లి యెచ్చటనైన నున్నదా?... ఈతరాని కప్ప ఏ దేశముందైనా నుండునా? పుట్టగానే క్యారుమనలేని బిడ్డ చచ్చినదనుట కేమైన సందేహమా? ఆంధ్రదేశమున బుట్టిన పక్షులైన ననవరతశ్రవణమున నాంధ్రమున మాటలాడుచుండగా - అయ్యయో మనుజుడే అంత మనుజుడే-ఆంధ్రమాతాపితలకు బుట్టిన వాడే - ఆంధ్ర దేశీయ వాయు నీరాహార పారణ మొనర్చినవాడే - అధమాధ మాఱు సంవత్సరముల యీడు వఱకైన నాంధ్రమున మాట లాడినవాడే - అట్టివా డాంగ్లేయ భాష నుపన్యసించిన మాత్రమున నిప్పుడాంధ్రమున మాటలాడ లేకుండునా-" అనిన పానుగంటివీరాంధ్ర వాక్యములు ఎంత దళసరి చర్మము వారినైన మార్చగల శక్తి సంభరితములు కదా?

కవి వ్యాసమున వచనము వెంబడి గల పద్యము పానుగంటికవి ఆంతరంగిక దశా విశేషములు తెలుపునది.

"మల్లెపూవుదూఱి మధుపంబుతో బాడి
గంధవాహుతోడ గలసి వీచి
యబ్ధిలోన మునిగి యౌర్వవహ్నిని గ్రాగికి
నీటి బుగ్గయగుచు నింగి బ్రాకి
తోకచుక్క తోడ డీకొని శ్రమజెంది
సాంధ్యగార నదిని స్నానమాడి
తనువునిండ నింద్రధనుసు రంగులు పూసి
కైవారప్తు సుధను గైపుజెంది
గోళగాన రుతికి మేళవింపు బాడి
పాడియాడు యాడిపాడి సోలి
భావనామహత్వ పటిమను బ్రహ్మమై
పోవు కవికి కోటి మ్రొక్కులిడుదు"

కవియనగా ఎవరనగా- "సమయానుసార సర్వతోముఖ సమ్మోహినీ కరణ సరస్వతీ మూర్తి" ఇది సాక్ష్యుక్తి. దీని కన్వర్థము పానుగంటి వారే. అది కల దిది లేదు. ఇది కల దదిలేదు అనునది సాక్షి విషయమున చెప్పలేము.

సాక్షి సంపుటములు అధునాతన కాలమున తెలుగువారికి బృహత్సంహితలు.