పుట:SaakshiPartIII.djvu/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎప్పడో వ్రాసెదమని వాగ్దాన మొనర్చుచునే యున్నారు. తీర నెవ్వఁడైన నొక్క తెలుఁగు గ్రంథము వ్రాసి దీని కుపోద్ఘాతము వ్రాయుడని వారిలో నెవరికైనఁ జూప నుపోద్ఘాతము నాంగ్లేయభాషలో వ్రాయుచున్నారు. పీఠిక లాంగ్లేయమున నున్న తెలుఁగుగ్రంథములు మనకుఁ గొన్ని లేవా? ఇదేమి కర్మము! ఆంధ్రసారస్వతచరిత్ర మాంగ్లేయభాషలో వ్రాయుచు న్నానని చెప్పినవారిని నే నెఱుఁగుదును. సంధ్యావందన మింగ్లీషుతోఁ జేయుదుమన్న వారితో మనకేమి వినియోగము. కాని వారిసాహాయ్యము లేనిదే మన మేమిచేయ గలము. వారు సాహసించి తెనుంగున వ్రాసినపైన భాషకుపకృతి జరుగుట నిశ్చయము. వారందరు మెకాలే (Macaulay),లాక్ (Ruskin),హెబ్బర్టుస్పెన్ సర్ (Hearbert Spenser) మొదలగు మహావచన ప్రబంధకర్తల శైలీభేదములు పూర్తిగ నెఱుఁగుదురు. వారికభిరుచియైన యేశైలినో యనుసరించి వారు గ్రంథములను వ్రాయుదురు. ఓ! ఇంక నేమికొదువ? ఖదమునడకవంటి శైలి యొకటి, చాదర్ ఖావంటి శైలి యొకటి, బాజీవంటి శైలి యొకటి, పందెపుడౌడువంటి శైలి యొకటి మనభాషలో నవతరింప జేయఁగలరు. చిత్రములైన శైలీభేదములు మనభాషలో మిగుల నరుదుగా నున్న వని వేఱె చెప్పనేల? రైమని పేకచువ్వ పైకెగిరినట్లున్న శైలిభేద మేది

కాకి పైకెగిరియెగిరి రెక్కలు కదలకుండ జందెపుఁ బెట్టుగసాపుగ వాలుగ దిగునప్పటి లఘుపతన చమత్కృతికన బరుచు శైలి పద్దతి యేది? తాళము వాయించునప్పటి తళుకుబెళు కులు, టంగుటంగులు, గలగలలు, జలజలలు గలశైలి యేది? మహాజనులారా! ఇట్లు నే నెన్ని చెప్పవచ్చును? భయంకర మయ్యును మనోహరమై, మహాశక్తి సక్తమయ్యు మార్డవయు క్తమై, ధారాళమయ్యు విశాలమై, స్వభావ సమృద్దమయ్యు సరసాలంకారభూయిష్టమై, సముద్ర ఘోషముగల దయ్యు సంగీతప్రాయమై, స్పష్టీకృత సకలవిషయతత్త్వమయ్యు నస్పష్టస్వకీయ తత్త్వమై చదువరులకుఁ గనుకట్టై, వాకట్బై, మదిగట్టై తల పులిమినట్టు శ్వాసమైన సలుపకుండఁ జేసినట్లు ముష్టినాని చిప్పనుండి మూర్ధాభిషిక్తుని కిరీటమువఱకు భూమిక్రింది యరలనుండి సముద్రములోని గుహలవఱకు నెవరెస్టు కొండనుండి యింద్రధనుస్సురంగుల వఱకు మందాకినీతరంగ రంగద్దంసాంగనాక్రేంకారముల నుండి మహాదేవ సంధ్యాసమయ నాట్యరంగము వఱకు మనోవేగముతో నెగురుశక్తిగల చిత్రవిచిత్రశైలీభేదము లింక నెన్నియో భాషలలో బుట్టవలసి యున్నవి. అట్టు సృష్టికి సమర్ధులగువా రెందరో యిట నున్నారు. బహుధన మున్నది. పరికరనికరమున్నది. పాత్రసామగ్రియున్నది. పాచకులున్నారు. ప్రబలుఁడైన శని నోటనుండుటచే భాషావచనశైలి బలహీనమై పౌరుషరహితమై యున్నది. నకన కలాడుచు నన్నమోరామచంద్రా యనుచున్నట్లున్నది. ఈలోప మెట్లు తీరగలదో సాహిత్య పరిషత్తువారు సత్వరము సమగ్రముగ యోచించుట కర్తవ్యము.

సాహిత్యపరిషత్తు:-సాహిత్యపరిషత్తువారే యీబాధ్యత బహుళముగా వహింపవలయు నని నా వినయపూర్వక విజ్ఞాపనము. వారు పైవారెవరిచేతనో యీ గ్రంథముల వ్రాయింప నక్కజలేదు. ఆంధ్రదేశ పండితులాంధ్రదేశవచన గ్రంథకర్తలు నాంధ్రదేశకవులు సాహిత్యపరి షత్తులోనివారే కాక పైవా రెవ్వరున్నారు? అట్టివా రెవరైన నున్నయెడల వారిని బ్రార్డించి పరిషత్తులోఁ జేర్చుకొందము. సైనిజెప్పిన గ్రంథములు వ్రాయవలసిన వారు మనలోనివారే.