పుట:SaakshiPartIII.djvu/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అమ్మా! Evolution గూర్చి Heredity ని గూర్చి యట్టివా రొనర్చిన విపరీత సిద్ధాంతము లందు నీవు విశ్వాస ముంచి మనవారి సిద్ధాంతములను బాటిసేయకుండుట తగునా? ఇంతకును నీవు మన సిద్ధాంతసాంప్రదాయములను బూర్తిగ నెఱుంగకుండఁబైవారి వాక్యములే సిద్ధాంతము లని నిర్ణయించుటకు నీకేమి యధికారమున్నది? ఆత్మను బునర్జన్మమును నమ్మిన మన కనాత్మవాదుల సిద్ధాంతములు వలదు. నిరీశ్వరవాదుల సిద్ధాంతములు మొదలే వలదు. మనలో మతమునకు వేదాంతమునకు సంపూర్ణసామరస్య మున్నది. వారిలో లేదు. వారిలో మతమును నమ్మిన వాఁడు వేదాంతమును బారలౌకికానంద భంజకముగను భగవ త్తత్త్వ దూషకముగను భావించును. ప్రకృతిజ్ఞాన సంపన్నులైన సిద్ధాంతులు మతము మూఢజ నచిత్తాకర్షణమైన బొమ్మలాటగ భావింతురు. ఈ రెంటకి సామరస్యము కుదిరినఁ గాని మతము నిలువదు; వేదాంతము నిలువదు. వేదాంతము లేని మతమైనఁ గొంతకాలము నిలుచును గాని మతము లేని స్వసౌఖ్యపరమావధికిఁ బరహింసాప్రవీణతకుఁ బ్రపంచవిశ్రాంత ప్రఖ్యాతికిఁ బనికివచ్చును గాని చిత్తశాంతికి, వైరాగ్యమునకు, యోగమునకు, నాత్మజిజ్ఞాసకు, నపరోకమార్గమునకు నక్క ఆకు రాదు. అసంతుష్టి కరములై యపూజ్యములై యనాత్మక ములైన వారిసిద్ధాంతములకు వారే కొంతకాలమైన పిమ్మట వెగటుపడక తప్పదు. ఇప్పడి ప్పడే యేదో కొంత విసుగుదలతోఁ గూడిన స్వల్పవైముఖ్యము వారి మనస్సులం దీసిద్ధాంతముల యెడలఁ గలుగుచున్నట్టు కొన్నిచిహ్నము లగుపడుచున్నవని కొందఱు చెప్పచున్నారు. పుణ్యమున కుత్తమ లోకఫలము లేదన్న వేదాంత మెంతకాలము మనస్సు నకు సంతుష్టి నీయంగలదు? సర్వరక్షకుండే లేని వేదాంతమం దెంతకాలం మనోధైర్య ముండ గలదు? అణువులు (Atoms) నిన్ను రక్షించునని చెప్పినమాటను నీ వెంత కాలము నమ్మఁగలవు?

అమ్మా! నీ విట్టి సిద్ధాంతముల నాధారముచేసికొని వాదించుట సమంజసము కాదు. నీయాంగ్లేయభాషాజ్ఞానమునకు, నీగ్రంథపరిశోధనమునకు నేను సంతసించితిని. కాని మన యార్షమతమునందలి నీ యనాదరణమునకు విచారించుచున్నాను. మన పెద్దలు జీవుని పునర్జన్మమును గూర్చి యెట్టి యభిప్రాయమును వెల్లడించిరో రవంత కనుగొందము. అమ్మా! నేను నీమాత్రమైనఁ జదువుకొన్న వాఁడనుగాను. కాని పెద్దల సేవించుచు హెచ్చుకాలము గడపినవాఁడ నగుటచే వారిప్రసాదమునఁ గొన్నిమాటలు నాచెవి నప్పడ ప్పడు పడినవి. అవి సంగ్రహముగ మనవి చేసెదను.

స్థూల సూక్ష్మ కారణ శరీరములని శరీరములు మూఁడు. మనుజుని మరణానంతరము స్థూలశరీర మిచ్చట మంటలోనో మట్టిలోనో కలసిపోవును. ఇంక సూక్ష్మకారణ శరీరము లున్నవి. సూక్ష్మశరీరములోఁ గారణ శరీరముండును. బాదముకాయలోఁ బలు కెట్లో యటులే యుండును. సూక్ష్మశరీరము వెలుతురు (Light) విదుచ్చక్తి (Electricity) వంటిది. సూక్ష్మశరీరములో నున్న జీవాత్మకు మోక్షము సూక్ష్మశరీరము పూర్తిగా నశించిన పిమ్మట గాని కలుగదు. అట్టిస్థితి కర్మరాహిత్య వాంఛారాహిత్య పూర్వకమయిన జ్ఞానమువలనఁ గని, భక్తివలనఁగాని పరమేశ్వరకటాక్షము వలనఁగాని కలుగును. అంతవజకు సూక్ష్మశరీరమాత్మ నంటిపెట్టి కొనియే యుండును. లోపల జీవాత్మగల యీసూక్ష్మశరీరమునకే మన పెద్దలు పునర్జన్మమును నిర్మించినారు. ఈ జీవుఁడు విశేష పుణ్యము లొనర్చుకొన్న వాఁడైన యెడల