పుట:SaakshiPartIII.djvu/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21. ఉత్తరరామచరితము - పటము

వభూతి గురించి తమ సభలో ప్రసంగించిన శాస్త్రిగారు ఆ కవి వ్రాసిన ఉత్తర రామచరిత నాటకం గురించిన మరొక విమర్శను చదువుతానంటే, జంఘాలశాస్త్రి మళ్లీ అవకాశమిచ్చాడు.

ఈ నాటకంలో 'చిత్రపటదర్శనాంకం" అని ఒక అంకం వుంది. ఉత్తరరామచరితను చెప్పడానికి ముందు స్థాలీపులాక న్యాయంగా పూర్వరామ చరిత్ర చెప్పడానికి ఉద్దేశించినదీ కల్పన.

తమ చరిత్రమే చిత్రపటాన వ్రాయించి తామే చూపించుకుని, జనులు సంతోషించడమో, ఏడవడమో జరిగింది ఈ నాటకంలో మాత్రమే.

ఉత్తరకాండం వాల్మీకిదేనని కొందరు, కాదని కొందరు వాదించడం వున్నా, భవభూతి మాత్రం అది రామాయణంలోని భాగమేనని నమ్మినట్టు తోస్తోంది.

వాల్మీకి, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మాత్రమే సీతారామలక్ష్మణుల హృదయ ప్రకృతుల్ని ఎరిగినవాడు. భవభూతి, ఈ చిత్రపట దర్శనాంకంలో ప్రకృతి విజ్ఞానాన్ని సంపూర్ణంగా, జాగ్రత్తగా పాటించలేదని పండితుడి విమర్శ. కొన్ని కొన్ని సందర్భాలలో సరిగా కనిపెట్టినా, ఏ ఏ సన్నివేశాల్లో 'చిత్రపట దర్శనం’ అనేది విచారాన్ని హెచ్చిస్తుందో, తగ్గిస్తుందో, భవభూతి పొరపడ్డాడని, ఈ విమర్శకుడు భావించాడు. ఈ అంకంలో అంశాన్ని ఒక క్రమంలో ఈయన విమర్శించినా - "దే హి నో ద్విసాంగతాః’ అనే శ్లోకంలో ఆయన చూపిన కవిత్వ శక్తిని ప్రశంసించాడు. ఈ కవికి రసపుష్టి కలిగించడం మీద ఎక్కువ అభిమానమనీ, ఆయన ఆవేశ శీలుడనే 'కిమపి కిమపి” అనే ఒక్క శ్లోకమే ఆయన మహాకవి అనడానికి చాలుననీ తీర్మానించాడు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను:-

భవభూతి యుత్తరరామచరితమునుఁ గూర్చి కొలఁదినముల క్రింద నుపన్యసించిన యాతండు తిరుగ నొక విమర్శనము చదువును. శ్రద్దతో వినవేడుచున్నాను. శాస్రులుగా రిట్టు చదివిరి:-