పుట:SaakshiPartIII.djvu/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18. సుఖప్రారభ్ధము

జంఘాలశాస్త్రి ఈ ప్రపంచం తీరు గురించి వివరిస్తూ-ప్రతి జీవికి కష్ట ప్రారబ్ధం ఎలాంటిదో, సుఖ ప్రారబ్ధం కూడా అలాంటిదేనని వివరిస్తున్నాడు. అంటే, కష్టాన్ని తప్పించుకోలేనట్టే. నీవు నిర్ణయించివున్న సుఖాన్ని కూడా తప్పించుకోలేవురా! అని చెప్పడం.

భగవంతుడి తత్త్వాన్ని గురించి ఏమీ చెప్పకుండా మౌనంగా వూరు కున్న బుద్దుడు సైతం మన కర్మాన్ని అనుసరించే ఉత్తర జన్మఫలం వుంటుందని స్పష్టంగా చెప్పాడు.

మన సంపదలకీ మన ఆపదలకీ, మన జన్మలకీ, మన మోక్షానికీ-ఇదీ అదీ అని లేదు. మనతో సంబంధించిన అన్నింటికీ కూడా కర్తలం మనమే. తిట్టుకో దలుచుకుంటే మనల్ని మనమే తిట్టుకోవాలి. కొట్టుకో దలుచు కుంటే మనల్ని మనమే కొట్టుకోవాలి. కోసుకోదల్చుకుంటే మనల్ని మనమే కోసుకోవాలి. ఇతరుల్ని పల్లెత్తు మాటకూడా అనకూడదు. పరిపాలకుల కేమి, ఈశ్వరుడికేమి, మనకర్మతో సబంధం లేదు. మన కర్మల్ని అనుసరించి ఈశ్వరుడు ఆయా కర్మఫలాన్ని పంచిపెడతాడు. కష్టకాలాన్ని కానీ సుఖ కాలాన్నికాని రవ్వంత కూడా పెంచడం సాధ్యం కాదు. మనమే ఒక ప్రపంచం. మనకు మనమే ఈశ్వరులం.

ఇందుకు ఉదాహరణగా, ఒక విరాగి జనక చక్రవర్తిని కలుసుకున్నప్పటి ఉదంతాన్ని జంఘాలశాస్త్రి విపులంగా కథనం చేశాడు. సుఖప్రారబ్దం అనేది, అడవులబట్టి పోయినా వెంటబడి వస్తుందని నిరూపించాడు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను:-

నాయనలారా! ప్రపంచజీవులలో నాకారములందు భేదమున్నది. ఆయుఃపరిమితు లందు భేదమున్నది. గుణగణములందు భేదమున్నది. బుద్దిజాతులందు భేదమున్నది. భాగ్యవైఖరులందు భేదమున్నది. అభ్యాసరీతులయందు భేదమున్నది. కాని కష్టసుఖానుభవ ములందు భేదము లేదు. ఎవనివంతు వచ్చినప్పడు వాఁడు కష్ట మనుభవింపవలసినదే. సుఖముకూడ నట్లే యనుభవింపవలసినదే. నాకుఁ గష్ట మక్కఱలేదని నిరాకరించిన నదిపోదు. అనువాఁడు లేఁడుకాని నాకు సుఖ మక్కఱలేదని త్రోచివైచిన నదియు బోదు.