పుట:SaakshiPartIII.djvu/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్యారహస్యము లెన్నియో వెల్లడింపఁ గలరు. అట్టి మహాసభకు మతాభిమాన న్యాయముచేత మంగలియే యధ్యక్షుండుగా నుండఁ దగినది. కాని మొన్న జరిగిన కార్యనిర్వాహకసభలో మిమ్మధ్యక్షుడుగా నాహ్వానించుట కేకగ్రీవముగ దీరుమానించు కొంటిమి. మంగలికి రాదగిన మహాగౌరవమును మతాంతరున కిచ్చి స్వార్థపరిత్యాగమును మాసభవా రగపఱచి నారు. మీ రగ్రాసనాధిపతిగా దయచేసి మమ్మానందింపఁ గోరుచున్నాము- ఇట్లు విన్నవించు కార్యదర్శి.

ఉత్తరమైనది. దీనికిఁ బ్రత్యుత్తర మేమని సభలో జంఘాలశాస్త్రి యడిగెను.

అంత వాణీదాసుఁడు లేచి యిట్టనియెను. క్షురకసోదర శిఖామణులు మీ కిచ్చిన గౌరవమునకు మీరు సర్వవిధముల నర్హులు కావున నంగీకరించితినని లేఖ వ్రాయవలయును.

అంత కాలాచార్యులు లేచి యిట్టనియెను.

ఇది మతవిద్యతోఁ జేరినయంశము. మతవిషయక మగు నాసభకు మతేతరు డధ్యక్షుడుగా నుండుట తగదు. అందుచే జంఘాలశాస్త్రి పోఁగూడదని నా యభిప్రాయము.

అంత సభనుండి యొక్కడు లేచి యిట్టనియెను.

సోదరులారా! కాలాచార్యులు చెప్పినమాట కేవల మనుచితముగ నున్నది. ఇందఱు మంగళ్ల యభిప్రాయమును నిరాకరించుట తగదు. అందులో మతవిభేదమే కారణముగ నెన్నఁడును నిరాకరింపఁదగదు. మతసంబంధమగు పట్టుదలచేతనే జంఘాలశాస్త్రి నిరాకరించినాఁడని మంగళ్ల కేమాత్రము తెలిసినను వారు బ్రాహ్మణులపై సత్యాగ్రహమును జరిపి తీరెదరు. అప్పడు బ్రాహ్మణులు గిజగిజలాడవలసి వచ్చును కురకర్మ మెట్లో స్వయముగా దీర్చుకొందుమని పురుషులు లక్ష్యపెట్టక పోయినను స్త్రీలమాటయేమి? వితంతువులలోనే కాకుండ నీకాలములో సువాసినులకు గూడదల కత్తిరించు కొనుటకై మంగలి యపేక్షగలదు. ఇదివఱకే యనేక భేదములుచే దేశ ముల్లోలకల్లోమై తపించుచుండ శక్తివంచన లేకుండ నుపశాంతి చేయుటకు బదులుగ వృద్ది పఱచుటకై ప్రయత్నించుట బుద్దిహీనతకంటె భిన్నమా? కావున జంఘాలశాస్త్రి యంగీకరింప వలసియున్నది.

ఈయుపపాదనమును సభవారందఱు కరతాళధ్వనులతో నంగీకరించిరి.

ఇంతకంటఁ జదువఁదగిన లేఖలు లేవు. చూడఁదగిన వ్యవహారము లంతకన్న లేవు.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః