Jump to content

పుట:SaakshiPartIII.djvu/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోదు. మనము తిరుగ నాంతరంగిక పరీక్ష చేసికొందము.

మనజాతి భూతదయకుఁ బ్రసిద్ది కెక్కినది. ఈదేశములో జరుగుచున్న యన్నదాన మెచ్చటను జరుగటలేదు. ఇన్ని దేవాలయము లెచ్చట నున్నవి. ఇన్ని చలిపందిళు లెచ్చటనున్నవి? చెదల కాహారములే, చీమలకు చిందబెల్లములే, పాములకు క్షీరాభిషేకములే. తుదకు దోమలు కుట్టిన పశువులొడలు రాచుకొనుటకు రాతికంబములే. అట్టి మనము వితంతు స్త్రీలను భర్తలతోఁ గాల్చినప్ప డెంతదయ గనబఱచితిమో చెప్పవలయునా? వితంతువులకు వివాహము లేకుండ వారికి భోజనమైనఁ దిన్నఁగ లేకుండ వారితలలపై గృహకృత్యభారం ముంచి వారిని బాధించునప్పడు మనదయ యెట్టిదో లోకమునకుఁ దెలియుట లేదా? తోడిమానవులైన పంచములను, మన కెన్నివిధములుగానో యుపకరించు చున్న పంచములను నధమస్థితిలోనుంచి వారిని మనుష్యుల వలె జూడకున్నప్పడు తెలియలేదా? వారివ్యవసాయము మనకుం బనికివచ్చు నేమో? వా రిచ్చిన ధాన్యము మనకుఁబనికివచ్చునేమి? వారుమేపిన పశువుల పాలు మనము త్రాగవచ్చునేమి? వారుచేసిన శ్రమ యంతయు మనకుఁ బనికివచ్చునేమి? అట్టిచో నింత యుపకారకుల నేల యస్పృశ్యు లగా నుంచవలెను? కుక్క ప్రవేశించిన యిల్లు మైలపడలేదో? గాడిద లోనికివచ్చిన మైలపడలేదో? పంచముడు వచ్చిన యెడల మైలపడునా? మనము వారియెడల మనుష్యులవలెఁ బ్రవర్తించుటలేదు. ఆమనుష్యులను నీచజంతువులకంటె నీచముగాఁ జూచిన ప్పడు మనము మనుష్యులమే కామని పైవా రనుకొనినఁ దప్పేమున్నది?

ఇక సత్యమునుగూర్చి చెప్పెదను. సత్యము సృష్టి కాధారమై యున్నది. అట్టి సత్యము మనలో నెట్టున్నదో చూతము. ఏమి చెప్పవలయును. ఎవడెఱుఁగఁడు. అసత్యముకొఱకే కానియెడల నిన్నికోర్డులెందులకు? ఇందరు న్యాయమూర్తు లెందులకు? ఇందరు న్యాయవాదు లెందులకు? ఇందరు కక్షిదారు లెందులకు? ఇంతబిళ్ల కర్చెందులకు? ఇందరు సాక్షు లెందులకు?

పూర్వమున నివి యేవియైన నుండునా? తాటాకుపాయమే పత్రము - సూర్యచంద్రులే సాక్షులు–ఇప్పడల్లా పత్రము వ్రాయుబోవునప్పడే, యెగబెట్టుటకు సాధన మెట్టో స్థిరపఱచు కొనుటకుఁ గట్టుదిట్టములైన యాలోచనలు చెప్పటకు కల్పవృక మైన ప్లీడరు మన కున్నప్పడు చిక్కేమున్నది? అతడే లేనియెడల వితంతువైన వదినెగారు వ్యభిచారిణి కావున మనోవృత్తి వ్యాజ్యెము చెల్లగూడ దన్న చల్లనియూహ మనకుఁ జెప్పినవా రెవరు? భార్యను జంపిన పాపాత్మునికిఁ దాత్కాలికోన్మాద మని రుజువు పఱచి యురినుండి తప్పించిన బుద్దిమంతుఁ డెవరు? ఎట్టి ఘోరాపరాధ మొనర్చిన వానికైనఁ బెరుమాళ్లకంటె ప్లీడరే యొక్కువ రక్షకుండు కాదా? వారిలో నసత్య ప్రోత్సాహకులు కొందరైన నుండుటచేతనే యిట్టు ప్రపంచ మింత దొరలిపోవుచున్నది.

ఇంకబాతివ్రత్యమును గూర్చి చెప్పెదను. భారతదేశమందుండిన ధనమంతయు బడమటికిఁ బోయినప్పటికిని భారతదేశ సౌభాగ్యమంతయుఁ బరశురామప్రీతి యైనప్పటికిని, భరతదేశ స్వాతంత్ర్యమంతయు భగ్నమైనప్పటికిని, మనకింక మిగిలిన తఱుగులేని విఱుఁగులేని విలువలేని ధన మొక్క స్త్రీల పాతివ్రత్యమే కాదా?