పుట:Rangun Rowdy Drama.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాంకము.

83

ముఁ గావించితిరి. నాపాలిటిభగవంతునివలె నేగుదెంచి, నా పాపజీవితము నంతము నందించి పరమేశ్వరసాన్నిధ్యమునకు దారిచూపితిరి. మీకిదే తుదినమస్కారములు. అబ్బా! కన్నులు పచ్చనై ప్రపంచమంతయు గిరిగిరఁ దిరిగిపోవుచున్నది. సేట్‌జీ ! మీకిదే నమస్కారము. నే నిఁక మాటాడజూలను. హా భగవానుఁడా! (మరణించును.)

[దాసి ప్రవేశము.]

దాసి - హా ! హా ! ప్రభావతి మరణించినది. ఏమిగతి !

(నిష్క్రమించును.)

గంగా - అర రే! నిజముగా నిది మరణించినది. ఈఖూనీ కేసొకటి నాపైఁబడును గాఁబోలును. ఎవ్వరును చూడకముందే నేను పారిపోవడమే మంచిపని. (పోఁబోవును.)

[రెండవవై పునుండి . శంకరరావు తూలుచు ప్రవేశించును.]

గంగా -- (చూచి) ఏమి యిది ! శంకరరావువలె నున్నాఁడు. ఈహంతకుఁడు తిరిగితిరిగి తుద కిక్కడకు చేరుకున్నాఁడా! తాగియున్నట్టున్నాఁడు. ఇదే సమయము. ఈఖూనీ కేసును వీనిబాద త్రోసెదను.

(నిష్క్రమించును.)

శంక - గిరికుమారీ ! గిరికుమారీ ! ఏదీ యెక్కడను గనఁబడదే. (ప్రభావతినిజూచి) ఇచ్చట నెవ్వరో పడియున్నారు. మరణింపలేదు గదా ! (దగ్గరకేగి పరికించి) హా! భగవానుఁడా ! ఇదియెవ్వరు? ప్రభావతియా యేమి ? పిశాచమువలె నావెంటఁబడి యిక్కడకుఁగూడ వచ్చినదే ! వచ్చిన దిట్లు చచ్చినట్లు పడియుండనేల ! (కాలితోఁ దన్ని) ప్రభావతీ ! ప్రభావతీ ! ఏమి పలుకదు. కదలదు. (శ్వాస పరిశీలించి) దైవమా ! ఇంకేమున్నది ! దీని శరీరమున ప్రాణములులేవు.