పుట:Rangun Rowdy Drama.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

రంగూన్‌రౌడీ.

దెరచితిని. నీయనుగ్రహాజ్యోతింబ్రదర్శించి నన్ను సన్మార్గమునం బ్రవేశపెట్టుము.

ఉ. కామము రెండుకన్నులను గప్ప వివేకము లేక దుష్టనై
    పామరబుద్ధిచే నఖిలపాతకముల్ తలదాల్చినాను స్వా
    మీ ! మనఁజాల నీధరణి నీప్సితముల్ త్యజియించి నిన్ను నా
    స్వామి వటంచు నమ్మితి విపన్నను నన్ను తరింపఁ జేయవే !

శంక - ఓహో ! జారిణి యిఁక సన్యాసిని యగును కాఁబోలును. చింతామణీచరిత్ర మేమైనఁ జదివితివా యేమి ?

ప్రభా - ఛీ ! పాపీ ! నీయిచ్చవచ్చినట్లు ప్రేలుకొనుము. నీ మొగముఁజూచిన మహాపాతకములు చుట్టుకొనును.

శంక - (నవ్వి) ఆగ్రహింపకుము. ప్రభావతీ ! ఆగ్రహింపకుము. ఇంత యాగ్రహము గలదానవు యోగిని వెట్లయ్యెదవు ?

ప్రభా -- (స్వగ) వీఁడు నన్ను నిందించుచున్నను, నాతరణోపాయమునకుఁ దగినట్లు జ్ఞానప్రబోధమే చేయుచున్నాఁడు.

శంక - ప్రభావతీ ! అందులకుఁగాదు. నేను చెప్పఁబోవున దేమనఁగా! యోగినులకు రత్నహారములు, చీనిచీనాంబరములు ఉపయుక్తములు కావుగదా? రుద్రాక్షలును జేగురుగుడ్డలును ధరించుట మాని నీవు సర్వాభరణములతో నన్ను వదలిపోవుటలో నీయభిప్రాయ మేమా యని - ఒకసారి జారిణివైతివి కావున నీగుణము నందు నాకు సందేహము గల్గుటచే నవ్వు వచ్చినది.

ప్రభా -- (స్వగ) ఆహా ! ఎట్టిజ్ఞానప్రబోధ! ( ప్రకా ) నిజమే. శంకరరావు! నీవన్నమాటనిజమే! నా కీయాభరణములతో పనిలేదు. ఇంక వీనినిమాత్రము నే నేమిచేసికొందును? ఈయైశ్వర్యమంతటితో పాటుగా నాశరీరాభరణములను గూడ గైకొని నీవే యనుభవింపుము.

(తీసియిచ్చును.)