పుట:Rangun Rowdy Drama.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[5]

చతుర్థాంకము.

63

నీకొఱకై విరోధముంగూడ త్రవ్వి తలకెత్తుకొనిననాకు నీవొనరించినప్రత్యుపకారమఁటరా యిది ! కుటిలహృదయా! కాలసర్పమువలె నాయింటఁ జేరి నాభార్యను నాధనమునే యపహరింపఁ దలఁచితివా ! పాపాత్ముఁడా ! కులనాశకా ! ఇంక నీ కెట్టిపాట్లు గల్గించెదనో చూడు.

శంక - మహారాజా ! తొందరపడకుఁడు; శాంతింపుఁడు. రక్షించినవారు భక్షింపఁదలఁచు టుచితమగునా ! తమరు పెద్దవారు; దయా సముద్రులు. ఒకవేళ మావంటిపిల్లలు అవివేకంబున దోషమే చేసినను క్షమింపవలయును. కాని యింతయాగ్రహము చూపిన యెడల బ్రదుకఁగలమా !

రమే - ఛీ! దుష్టుఁడా ! నిన్నింకను క్షమింపవలయునా! నీయెడ క్షమాగుణముఁ జూపుట కొఱవితో తలగోకికొనుటఁగాదా? పాపమతీ ! ని న్నేమిచేసిన పాపమున్నదిరా ? హంతకుఁడవై విదేశముల పాలగుటకు సిగ్గునొందక ఆదరించినవానిభార్యను చేరఁదీసి ధనమానముల నపహరించినది చాలక స్వభార్యను కత్తిపోటునఁ బడవేసిన చండాలుడవు ? నీయందా దయదలుచుట ? బుద్ధిహీనుఁడనై యిదివఱకు చెడితిని కాని యిఁక నీకు తరుణోపాయము లేదు. ఇప్పుడే నిన్ను రాజభటుల కప్పగింతును.

శంక — (తుపాకినీ జాగ్రత్తపఱచి యుంచుకొని) అట్లయిన నన్ను క్షమింపఁదలఁచుకొనలే దన్నమాట.

రమే - క్షమాపణ యనుమాటను నాయెదుట నెత్తకుము. ఇదివఱకు హంతకుఁడవు, జారుఁడవు, కృతఘ్నుఁడ వైతివి. ఇప్పుడు చోరుఁడవుగూడ నైతివి. నీ మొగముచూచిన మహాపాతకము.

శంక - అన్నదాతవు. క్షమింపుము; క్షమింపుము. ఆగ్రహ మపాయకరము సుమా!