పుట:Rangun Rowdy Drama.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాంకము.

57

జయరాం - (ప్రవేశము.)

నాందీ - దర్వాన్ !

జయ - అరే భగవాన్ !

నాందీ - దర్వాన్ ! నాకొడుకును చూచావా ?

జయ - చూచానమ్మా. చూచాను. ఇది గంగారాంసేట్ అదృష్టం.

నాందీ - గంగారాంసేట్ అదృష్టం యిందులో యేమీ లేదు. ఇదంతా నా యదృష్టం.

జయ - మీయిద్దఱిలో యెవరి అదృష్టమైనా ఒక్కటే. మీ కిద్దఱికీ కొడుకే కదా!

నాందీ - ఆఁ ! ఆఁ ! అది నే నొప్పుకోను. వీఁడు నాకొడుకే గాని గంగారాంసేట్ కొడుకుగాఁడు.

జయ - అయితే ! యీబిడ్డకు తండ్రి యెవరని మీనమ్మకం ?

నాందీ - నాకూ అదే నమ్మకం లేకుండా వుంది. ఎవరినైనా ఒకతండ్రిని బేరమాడుదా మని చూస్తున్నాను.

జయ - అరే భగవాన్ ! లోకంలో యిలాటిబిడ్డలుకూడా వుంటారా !

నాందీ - దర్వాన్ !

జయ - భగవాన్ !

నాందీ - పోనీ గాని నేనొక సలహా చెప్పుతాను. వింటావా ?

జయ - వినఁదగినదైతే తప్పకుండా వింటాను.

నాందీ - పదిమందితో బేరముకన్నా ఇంటిలో కలిసి మెలిసి వుండేవాఁడవు- నువ్వెందుకు తండ్రివిగా వుండఁగూడదూ ?

జయ - అరే! భగవాన్ !

నాందీ - నీ కేదైనా సంబంధం వున్నా లేకున్నా నువ్వే ఈకుఱ్ఱవాఁడికి తండ్రివి. తెలిసిందా ! ఇంకంతే; సేఠాణీగారి ఆజ్ఞకు తిరుగు లేదు. ఇడుగో ! పిల్లవాని నెత్తుకో ! నేను మళ్ళీ వచ్చిందాకా నీదగ్గరే ఉంచుకో !