పుట:Rangun Rowdy Drama.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

రంగూన్‌రౌడీ.

అన్న - నాధా ! చిరకాలసమావేశానంతరమున అగ్నిసాక్షిగా వివాహమైన నాస్వత్వమగుతమపై నే నీమాత్రపుచనవుఁ గైకొనుటకు దేశకాలములయాటంకము గల్గునా !

శంక - దాని కేమిగాని నీవిక్కడి కెట్లువచ్చితిని ? ఎప్పుడువచ్చితివి ?

అన్న - నాఁడు తమ రట్లు పలాయనమైనవెనుక మనఆస్తినంతయు మందిరముతోఁబాటుగ గంగారాముఁడు స్వాధీనపరచుకొనియెను. మీసోదరికిని, నాకును కృపాస్వభావుఁడగు కృష్ణమూర్తి శరణ్యుఁ డయ్యెను. చిరకాలము తమపోఁబడి నెఱుంగక కృశీభూతనై యుండి తుద కెవ్వరో చెప్పిన గాలివార్తవలన తమ రీపురమం దున్నట్లు విని సాహసించి వచ్చిన నాదోషమును సైరింపవలయును. తమ రిఁకనైన నావెంట స్వదేశమునకు రావలయు నని ప్రార్థించుచున్నాను.

శంక - ఎందులకు ? హంతకుఁడ నను నేరముపై నురిదీయఁ బడుటకా ?

అన్న - తమపైనుండి యానేరమును తప్పించునేర్పాటు చేయుదుననియు, నందుల కెంతధనవ్యయ మైనను వెనుదీయ ననియు, కృష్ణమూర్తి వాగ్దానము చేసినాఁడు.

శంక - నీతండ్రియే నాకు బలవద్వైరియై యున్నాడు. అతఁడు లంచముల కాశపడువాఁడు కాఁడు. నీ వెఱుఁగుదువుగదా ! అందువలన నేమి లాభము ?

అన్న -- సాక్ష్యము మన కనుకూలముగా నున్నచో, నాతండ్రి యేమి చేయఁగలఁడు?

శంక - అన్నపూర్ణా! అందువలన నేమియు లాభములేదు. నీవును నాతోఁబాటుగ యీవిదేశములందు శ్రమనొందకుము. ఇంటికిఁ బొమ్ము. అదృష్టముండినచో నెన్నటికైనఁ గలిసికొనియెదను. నామాట విని మరలిపొమ్ము.