పుట:Rangun Rowdy Drama.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాంకము.

53

శంక - ఇది నే నెఱిఁగినకంఠస్వరముగానున్నది. నేనొక్కఁడనే పోయి చూచివత్తును. నీ వంతదనుక మనకారులోఁ గూర్చుండుము. పొమ్ము. నే నిప్పుడే వచ్చెదను.

ప్రభా - చిత్తము. (పోఁబోవును.)

శంక - ప్రభావతీ ! మాట. నీవద్ద నేమైన ధనమున్న నిట్లిచ్చిపొమ్ము.

ప్రభా - చిల్లరగా నేమియును లేదు.

శంక - ఎంతయున్నది ?

ప్రభా - వేయిరూపాయలకాగిత మున్నది.

శంక – సరే. దాని నిటు తెమ్ము,

ప్రభా -- (ఇచ్చును.)

శంక - నీవు వెళ్ళి కారులోఁ గూర్చుండుము. నే నిదే వచ్చేద.

ప్రభా -- (నిష్క్రమించును.)

శంక - (దగ్గరకు వచ్చి చూచి) సందేహములేదు. అన్నపూర్ణయే ! ఛీ - ఛీ - ఎంతఅపసవ్యకారణము! ఈపిశాచిని యిక్కడకుకూడ నన్ను వెంటాడి వచ్చి నాయానందమును పాడుచేయ సంకల్పించినదే? దీనికి కొంతధనమిచ్చి సాగనంపుటయే యుక్తమైనపని. ( ప్రకా) అన్నపూర్ణా ! అన్నపూర్ణా !

మోహ — ( లేచి) అమ్మా ! అమ్మా !

శంక - నాయనా ! మీయమ్మ మూర్ఛిల్లినది. నీకొకపాత్రము నిచ్చెదను. ఆచెఱువులోనుండి జలముఁ గొనిరమ్ము.

(కారులోనిసాత్రము నీయఁగా బాలుఁడు నిష్క్రమించును.)

శంక - అన్నపూర్ణా ! అన్నపూర్ణా !

అన్న - ( లేచి) హా మనోహరా ! ఎంతకాలమున కీ నిర్భాగ్యురాలికి దర్శన మిచ్చితిరి?

(పాదములఫైఁబడును.)

శంక - లెమ్ము. లెమ్ము. ఇది బహిరంగమైనయుద్యానవనము. ఈప్రదేశమందు నీ విట్టిచేష్టలు చేయరాదు,