పుట:Rangun Rowdy Drama.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

రంగూన్‌రౌడీ.

శంక - అట్లయిన నిఁక మనసందేహములు విదాహము లైనట్లే. ఈ రాత్రియే నీభర్తనిద్రించువేళ వానిని తస్కరించెదను. రేపటి తెల్లవాఱుజామున వేఁగుజీకటియందే కలకత్తా స్టీమరుపై మన ప్రయాణము. అర్థమైనదా?

ప్రభా - ఈలోపల నాభర్త యేమాత్రమును అనుమానింపకుండనుండునట్లు మాత్రము ప్రవర్తింపవలసియున్నది.

శంక - అందులకై నీకు సందేహ మక్కఱలేదు. ఆతనికన్నులలో కారమును జల్లుభారము నాది. ఇప్పుడు నాహృదయము పరమానందభరితమైనది. (ముద్దిడుకొనును.)

(అనుబంధము-17.)

అన్న - (మొగము త్రిప్పుకొని శోకముతో) ఓభగవానుఁడా ! ఎంతఘోరము ! తుదకు పరదారాపహరణ ప్రవీణుఁ డగు నాభర్త దురాగతమును నాకంటఁబడవేయుటకొఱకా యిట్టిసమావేశమును గల్పించితివి ? నే నీఘోరమును తిలకింపలేను, హా! పరమేశ్వరా!

(మూర్చిల్లును.)

శంక, ప్రభా - (విని ఉలికిపడుదురు.)

ప్రభా - హా! మనోహరా! పాప మెవ్వరోయబల కుమారునితో పాటుగ మూర్ఛనందియున్నది. భిక్షకురాలని తోచుచున్నది. చూచివత్తమా ?

శంక - (స్వగతం) ఇది మాయన్నపూర్ణకంఠస్వరమువలె నున్నది అన్నపూర్ణ యిచ్చటకు వచ్చుట యెట్లు సంభవించును? నిజముగా నొకవేళ అన్నపూర్ణయే యైనచో మిగులప్రమాదము రాఁగలదు. ఎట్లయినను దీని నిచ్చటనుండి సాగనంపితీరవలయును.

ప్రభా -- ప్రియా! ఏమి యాలోచించుచున్నారు ?