పుట:Rangun Rowdy Drama.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాంకము.

51

     అసహాయధనహీనదశయందుఁ బ్రభవించు
                   నాందోళనము మందు కైన లేదు

     ఇట్టి సంతసంబు హృదయేశునకుఁ గూర్చి
     నందు కోరమేశ ! వందనంబు;
     కాని, యిచట నొక్క కాంతాలలామతోఁ
     గూర్చినాఁడ వెంత క్రూరమతివొ ?

శంక – ప్రియా ! ప్రభావతీ ! నా యభిప్రాయమును వినిన పిదప నీవేమి యాలోచించితివి?

ప్రభా -- మనోహరా ! దీని కొఱకై యింత యాలోచన మేటికి? కాని, యొక చిన్నసందేహము మాత్రము నన్ను పీడించుచున్నది.

శంక - ఇంకను సందేహములు గలవా నీకు? నా సాహసాచరణముల యెదుట నెట్టి యనివార్య సందేహము లున్నను, పటాపంచలై పోవలసినవే! తెలుపుము ఆసందేహ మెట్టిదో! ఒక లిప్తమాత్రంబునఁ దీర్చివేసెదను.

ప్రభా - మరేమియు గొప్ప సందేహముగాదు. నా శరీరమునందలి ఆభరణములన్నియుఁగలిసి యేబదివేలవఱకునున్నవి. అవియన్నియు, నాభర్తగారి యినుపమందసమునందే భద్రపరుపఁబడియున్నవి. అవి మనచేతఁ జిక్కినయెడల సుఖముగా నెందైనఁగాలక్షేపము చేయుట కనుకూలముగా నుండునని నా యభిప్రాయము.

అన్న - (స్వ)హా! దైవమా! నానాథున కెట్టి దుష్టబుద్ధిని గలిగించితివి?

శంక - (ఆలోచించి) సరే! ప్రభావతీ! ఆయినుపమందసపుతాళపుచెవు లెవ్వరియొద్ద నుండును ?

ప్రభా -- ఒకరియొద్ద నను నియామకము లేదు. గృహమునందే యొకచో భద్రముగా నుండును. నాకు వలసినయెడల నేను గైకొనుట కెవ్వరి యాక్షేపణము నుండదు.