పుట:Rangun Rowdy Drama.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

రంగూన్‌రౌడీ.

జయ - ఆ ! వినుటయేకాదు. శంకరరావు తన స్వహస్తములతో తనతండ్రి రంగారావున కిచ్చిన పవరునామామీఁద వ్రాసియిచ్చిన అక్షరములనే చూచితిని.

కృష్ణ - ఇప్పుడు మన కా పవరునామా కావలెను. ఏయుక్తిచేత నైన గ్రహింపక తప్పదు. ఇందు నీ మిత్రవాత్సల్యముం జూపవలెను.

జయ - త్రాగుబోతును, హంతకుఁడును నగు శంకరరావుకొఱుకుగాదు గాని, పవిత్రమగు నీబాల్యస్నేహవాత్సల్యముకొఱకును, మహాసాధ్వియగు అన్నపూర్ణాదేవిసౌశీల్యముకొఱకును, గంగారామునిలోభిత్వముకొఱకును నా శిరస్సునైననుకోసి యిచ్చెదను.

కృష్ణ - ధన్యవాదములు ! జయరాం ! నీకు ధన్యవాదములు.

జయ - అది సరికాని, మిత్రుఁడా ! ఇప్పుడు నీకు శంకరరావుపై నింతవాత్సల్యము గలుగుట కేమికారణము ?

కృష్ణ - ప్రాణమిత్రుడ వగు నీయొద్ద నాకు దాపరిక మేమున్నది ?

ఆ. వె. గంగరాముసుతనుఁ గాంక్షించి నీవు ద
         ర్వానువృత్తినైనఁ బూనినటులె
         జానకీలతాంగి నేను గాంక్షించి యీ
         మోసవృత్తినైనఁ బూనవలసె.

శంకరరావు సర్వైశ్వర్యములును గంగారామునివశమగుటవలన నిప్పుడించుమించుగా వారిసంసార భార మంతయు నాయందే యున్నదనినమాట.

జయ - లక్షాధికారివి; ఒంటరిగాఁడవు; దుర్వ్యసనములు లేనివాఁడవు; నీ వీసంసారమునే కాదు ? ఇట్టివానిని పదింటినైన పోషింపఁగలవు. అది యుక్తముగానే యున్నది గాని ప్రేమవిషయమున నీకును నాకును సమానధర్మము చెప్పితివి, గాని సరిపడని విషయమే సుమా! ఏమందువేని-