పుట:Rangun Rowdy Drama.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాంకము.

45

జయ - కారణమా ! మా ప్రభువైనగంగారాంసేట్‌గారికి శంకరరావు చాలధనము బాకీ యున్నాఁడఁట. శంకరరావుభార్యాపుత్రులు నీయింట నున్నారఁట. వా రేమి చెప్పెదరో తెలిసికొని రమ్మని మాసేట్‌గారు పంపినారు.

కృష్ణ — అట్లయిన, మా కేమియు భయములేదు. ఈ దర్వాన్ మా మిత్రుడు జయరాంసింగ్ తప్ప వే రొకరు కారు. (మీసము లాగివేయును.)

జాన - (నవ్వుచు నిష్క్రమించును.)

జయ - (నవ్వుచు కౌగిలించుకొని) మిత్రమా ! నావేష మెంత చక్కగా నమరినదో, నీకు తెలియఁజేయుటకై నే నొనరించిన యీ చిన్నిహాస్యమునకు మన్నింపఁదగును.

కృష్ణ - మిత్రుడా ! జయరాం ! ఈ మాత్రమునకే నీవు క్షమాపణ వేడుకొనవలయునా ! బాల్యమిత్రులమైన మనకు పరిహాసములు పరిపాటియేగదా ! అందు నీవు కవీశ్వరుఁడవుకూడను. నీతో మేము మాటాడఁగలమా!

జయ - దాని నట్లుండనిమ్ము. ఇంతకును, నీవు నన్నుఁ బిలువనంపిన కార్యమేమి?

కృష్ణ - నీవు గంగారాంసేట్ మందిరమున దర్వాన్ పనియం దున్నావఁట కాదా?

జయ - ఒక "లవ్ ఎఫెయిర్” (Love affair) లో పడిపోయి నే నట్లు చేయవలసినచ్చినమాట నిజమే. కాని ఇప్పుడు నా యుద్యోగముమాట యెందులకు ?

కృష్ణ - ఉన్న వ్యవహారమే దానితో నున్నది. లక్షాధికారియైనశంకరరావుఐశ్వర్యము నంతను, యెట్లో మోసమున నీకు కాఁబోవు మామగారైనగంగారాంసేట్ చేఁజిక్కించుకొనినమాటను వినియుంటివికదా?