పుట:Rangun Rowdy Drama.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

రంగూన్‌రౌడీ.

        నిన్నుఁగాంచుభాగ్య మున్నదో లేదో; నీ
        తండ్రికంచు గుండెతల్లడిల్లు, (ముద్దిడుకొనును.)

మోహ - అమ్మా ! అమ్మా ! నీవెందు కేడ్చుచున్నావే !

అన్న - ఇఁక నా కేడుపే విధి విధించియున్నాఁడు తండ్రీ !

మోహ - అమ్మా ! నిన్నెవరేమన్నారో చెప్పవే. వాళ్ళను చితుక కొట్టివస్తాను.

కృష్ణ - అక్కా ! మీ రిక్కడనుండిన నిట్లే దుఃఖంతురు. మీకు దుఃఖించినకొలఁదియు కుఱ్ఱవాఁ డడలుచున్నాఁడు. మీరు లోనికిఁ బొండు. మే మేదో విధాన మాలోచించి, మార్వాడీచేఁజిక్కిన మీయాస్తిని మీకు వచ్చునట్లు చేయుదుము.

అన్న -- నాయనా ! మంచిది - మోహనా ! రమ్ము మనము లోనికి బోవుదుము. (లోని కిరువురును నిష్క్రమింతురు.)

కృష్ణ - జానకీ ! ముందుకర్తవ్యమేమి ?

జాన - మీ మిత్రుఁడు జయరాం గంగారామునికుమార్తెను వలచి వారియింట దర్వానుగా చేరియున్నాఁడని చెప్పితిరే ! తన్మూలమున సాధింపలేమా!

కృష్ణ - అవును నిజమే ! జయరాముఁడు నాకడకు వచ్చెదనని చెప్పెను. ఇంకను రాకున్నవాఁ డేమి చెపుమా !

జయ - (దర్వాన్ వేషమున ప్రవేశము.)

కృష్ణ --(స్వ-) ఎవ్వ రీపురుషుఁడు ! (ప్ర-) అయ్యా ! నీ వెవ్వఁడవు?

జయ - ఏమంత యగౌరవముగ “నీ వెవ్వఁడ” వని మాటలాడుచున్నావు ! కనుపడుట లేదా ! నేను ఫైల్ వానును.

కృష్ణ - కావచ్చును. ఐన నిన్ను నే నగౌరవించిన దేమున్నది ?

జయ - అంతయు సగౌరవము. ధనగర్వము.

కృష్ణ — తప్పున్న క్షమింపుఁడు. కాని నీ రాక కేమి కారణము ?