పుట:Rangun Rowdy Drama.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాంకము.

41

స్థలము - కృష్ణమూర్తియిల్లు.

[అన్నపూర్ణ, జానకి ప్రవేశము.]

జాన - వదినా ! దుఃఖించిన ప్రయోజన మేమైన నున్నదా? కన్నులు వాఁచి, కడుపు రవుల్కొని పోవుటకన్న కార్య మేమియున్నది ? సర్వము దెలిసినదానవు నీవును సంతాపమందిన నింకేమైన నున్నదా?

అన్న - మఱదలా ! భర్తృవియోగదుఃఖమొకటి కార్చిర్చువలె కాల్చు చుండగా, మామగారు సంపాదించినయాస్తి గృహసమేతముగ మార్వాడిచేతఁ బడినప్పు డీవ్యర్థప్రాణికి దుఃఖముగాక, యింకేమున్నది ! పోనిమ్ము, ఆస్తిమాట యేమైనను ఆయనప్రాణములైన తిన్నగానుండిన సంతసించి యుందును. రాజభీతిచే రంగూనునకు పలాయితుండైనప్రాణేశ్వరుఁడు మఱల వచ్చునా ? నాకు దక్కునా ? (ఏడ్చును.)

జాన - ఏమిపని యిది ! చంటిబిడ్డవలె నేడ్చుట సమంజసమేనా !

ఆ. వె. ఒక్క రీతి దినము లుండునె! సాంద్రఘ
         నాఘనములు వాయుహతిఁ దొలంగు
         నట్టు లెన్నఁడైన నాపద లెడఁబాసి
         శుభము గలుగకున్నె శుభవిచార !

అన్న - ఏనాటికైన సుఖియై వచ్చి మన కందఱ కానందముఁ గూర్పఁగలఁడు గాని, ఇదియేమి! ఆస్తి నంతను గంగారామునకు వ్రాసి యిచ్చుట యెందులకో తెలియకున్నది. మోసమేమైన జరిగి యుండునేమో!

(కృష్ణమూర్తి మోహనరావుతో ప్రవేశించును.)

జాన - అన్న - (లేచి నిలుతురు)