పుట:Rangun Rowdy Drama.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

రంగూన్‌రౌడీ.

(రమేశబాబు ప్రవేశము.)

శంక - మహాశయా! నమస్కారము.

రమే - మహానందము. కూర్చుండుము శంకరరావుజీ !

(తానును కూర్చుండును.)

శంక - (కూర్చుండును.)

రమే - మాయింట మీ కేలోపమును గల్గుచుండుట లేదుగదా?

శంక - ఆ! ఆ! యెంతమాటాడితిరి! నాస్వగృహమునకన్న నధికముగా సుఖించుచున్నాను. తమరు నా తండ్రికన్న నధికాదరణమును చూపుచుండ ప్రభావతీదేవి నా తల్లికన్న మిన్నగా నన్నుఁజూచు చున్నది. నాపురాకృతభాగ్యఫలమువలననే మీచేరక్షింపఁబడితిని. కాని నా హృదయమందలి భీతిమాత్రము నన్నువదలకున్న ది.

రమే – మిత్రుఁడా ! పోలీసువారిభయము నీ కెంతమాత్రము నక్కఱలేదు. నే నీపట్టణమున నున్నంతవరకు నీ ప్రాణములకు నాప్రాణముల నిచ్చెదను. ధైర్యము నవలంబింపుము.

శంక - మహాభాగ్యము.

సేవకుఁడు — [ప్రవేశము] (సలాంచేసి చీటి నిచ్చి) మహాప్రభూ ! అవధారు కాకినాడపోలీసు సూపరింటెండెంటుగారఁట తమదర్శనము కోరుచు ద్వారమున పోలీసుభటులతోఁగూడ వేచియున్నారు.

శంక - మహాశయా ! అతఁడె నామామయగు తులసీరావు. వెంటనంటి యిచ్చటికిఁగూడ వచ్చినాఁడు. నన్ను రక్షించుటకు మీకిదే సమయము.

రమే - శంకరరావుజీ ! భయమందకు. నీవు నీజననితోఁగలిసి అంతఃపురమున నుండుము. నే నాతని సాగనంపెదను.

శంక - రమేశమహాశయా ! బహూత్ మెహర్బానీ ! మాతాజీ ! దయ చేయుము.